కరీంనగర్, (విజయక్రాంతి): నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి); అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి రాజేందర్ రావ్ సన్మానం చేశారు.
ఎన్ ఎస్ యు ఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ అహర్నిశలు కృషి చేశారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ హై కమాండ్ పిసిసి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇందుకు బీసీ నేతకు బీసి అధ్యక్ష పదవి కట్టబెట్టడమే నిదర్శనమని తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్ కు వెలిచాల రాజేందర్ రావు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.