పార్టీ పెద్దల నుంచి చీవాట్లు తప్పవ్..
ఢిల్లీలోని సౌత్, నార్త్ బ్లాక్ లో డోమ్ లు కూల్చివేయాలని* అప్పీల్ చేస్తావా..
సెక్రటేరియట్ పైనున్న డోమ్ లు కూల్చి వేస్తామనడం అజ్ఞానమే..
ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ పండుగల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు..
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ నిత్యం సంచలనాల కోసమే తుప్పాల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. డోమ్స్ ఆర్కిటెక్చర్ అనేది హిందూ వాస్తు నిర్మాణంలో యూరోపియన్, మొగల్, రోమన్ ఆర్కిటెక్చర్ లో ఉన్న విషయం బండి సంజయ్ కి అవగాహన ఉండి ఉండదని పేర్కొన్నారు. ప్రతి డోమ్ ముస్లిం ఆర్కిటెక్చర్ గా పరిగణిస్తూ సంచలన స్టేట్మెంట్ల కోసం పరితపిస్తున్నారని మండిపడ్డారు. ఆయన గారు కూర్చునే హోం మినిస్ట్రీ, ప్రధాని మోడీ గారు కూర్చునే సౌత్ అండ్ నార్త్ బ్లాక్ లోనూ రాజ్పత్ రోడ్ నుంచి డోమ్ లను పరిశీలించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా గార్లకు వాటిని కూల్చివేయమని సర్జికల్ స్ట్రైక్ స్టేట్మెంట్ల స్పెషలిస్ట్ గారు అప్పీల్ చేయాలని సవాల్ విసిరారు.
ఈ పక్కా లోకల్ చీటికిమాటికి సర్జికల్ స్ట్రైక్ స్టేట్మెంట్లు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నందుకు కంగనా రనౌత్ గారికి పడ్డ చీవాట్లు బండి సంజయ్ కి కూడా పార్టీ పెద్దల నుంచి పడడం ఖాయమని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం పనికొస్తాయోమోనని బండి సంజయ్ వాలకం చూస్తే నరసింహ మాల, మల్లికార్జున మాల, విష్ణు మాల, శ్రీ రామా మాల, శ్రీ కృష్ణ మాల, రాఘవేంద్ర మాల, సుబ్రమణ్యేశ్వర మాల కూడా వేసుకోవాలని సంవత్సరం పొడుగునా మాలోద్ధరణతో ఉండాలని పిలుపుచ్చేలా ఉన్నారని పేర్కొన్నారు. అందుకోసం అవసరమయ్యే ఖర్చులు నేనే భరిస్తాననీ ప్రకటించేలా ఉన్నారని చెప్పారు. ప్రతిసారి ఎదుటి మతం వారి బట్టలు ఊడదీసి కొడతానని, పోలీసులు మాలలు ధరించిన స్వాముల వైపు కన్నెత్తి చూస్తే చీల్చి చెండాడుతాన ని ఉత్తిత్తి మాటలతో అరి వీర భయంకరుని ఫోజు ఇద్దామనే కోరికతో ఈ మహాత్ముడు ఉంటున్నారని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్ సెక్రటేరియట్ పైనున్న డోమ్ లను కూల్చివేస్తామని రాజకీయ అపరిపక్వతో, అజ్ఞానంగా మాట్లాడడం సరైంది గా లేదన్నారు.
చిహ్నానికి ప్రతికగా అధికార కేంద్రానికి కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్ర సచివాలయం పై డోమ్ లను ఏర్పాటు చేస్తే వాటిని కూల్చివేస్తామని రెచ్చగొట్టే విధంగా కేంద్రమంత్రై ఉండి అలా మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. మొన్నటి వరకు బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక విధానసభ పైన డోమ్ లు ఉన్నాయని, వాటి గురించి ఎందుకు ఎప్పుడు బండి సంజయ్ ప్రస్తావించలేదని తెలిపారు. బిజెపి అధికార ఉన్న రాష్ట్రంలో ఒక వైఖరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మరో వైఖరితో ఉండడం హస్యాస్పదమని పేర్కొన్నారు. కర్ణాటకలో డోమ్ లు ఉండడంలో తప్పులేదు.. తెలంగాణ సచివాలయంపై ఉండడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ద్వంద వైఖరితో మాట్లాడుతుంటారని, సంచలనాల కోసం నిత్యం తాపత్రయ పడుతుంటారని విమర్శించారు.
ఒక అంశం మాట్లాడితే దానికి సంబంధించిన సబ్జెక్టుపై వివరాలు తెలుసుకొని పూర్తి అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు సబ్జెక్టు తేలేదని అసహ్యించుకుంటారని పేర్కొన్నారు. తరచూ పండుగల సమయంలోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని, ఆ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ పైన డోమ్ లు ఉన్నాయని, దీని మీద మీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనేక ఏండ్ల క్రితం రాష్ట్రపతి భవన్ పైన డోమ్ లు నిర్మించారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మీరు రాష్ట్రపతి భవన్ పై ఉన్న డోమ్ లను కూడా కూల్చివేయాలని ప్రకటన చేస్తారా.. అని నిలదీశారు.
ఇంగిత జ్ఞానం ఉన్న వారు ఎవరు ఇలా మాట్లాడరని, బండి సంజయ్ ఏదో ఒకటి మాట్లాడడం కాదని, కొంత జ్ఞానోదయం చేసుకొని మాట్లాడాలని లేకపోతే ప్రజల్లో చులకన భావం కలుగుతుందని హితవు పలికారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ పైన కూడా డోమ్ లు నిర్మించారని, అసెంబ్లీ సమావేశాల్లో మీ ఎమ్మెల్యేలు తరచూ పాల్గొంటు న్నారని తెలిపారు. డోమ్ లు ఉన్న అసెంబ్లీ ప్రాంగణానికి మీ బిజెపి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. డోములు ఉన్నాయని వారికి గుర్తుకు రావడం లేదా.. శాసనసభ సమావేశాలకు వారిని రాకుండా మీరు ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఏదో ఒకటి నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు లబ్ధి పొందాలని చేస్తే నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు హిందువులు ఘనంగా జరుపుకో వడం ఆనవాయితీగా వస్తున్నదని, పూజలు చేయడం ఏళ్ల నుంచి ఉందని పేర్కొన్నారు.
వినాయక మండపాలకు ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ తో పాటు ఇతర వసతులు కల్పిస్తామని ప్రకటించారని చెప్పారు. మళ్లీ మీరు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యుత్ సరఫరాకు తానే ఖర్చులు భరిస్తానని పేర్కొనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. 11 రోజులపాటు ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేస్తుంటారని, బండి సంజయ్ కొత్తగా వినాయక మాల ధరించాలని సూచించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వినాయకుడి పూజలు గురించి హిందువులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరికీ వినాయకుడు పూజలపై సంపూర్ణ అవగాహన ఉందని బండి సంజయ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచించాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. పండుగల సమయంలో సంచలనాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.