calender_icon.png 21 November, 2024 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్ సునీల్ రావు ను బర్తరఫ్ చేయాలి

27-08-2024 03:00:28 PM

పదవికి ఎసరు వస్తుందని ఇతరులకు బాధ్యతలు అప్పగించలేదా..? 

గోప్యంగా అమెరికాకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో సమాధానమివ్వాలి.. 

పాలన గాలికి వదిలేసి విదేశీ పర్యటన అవసరమా..? 

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు 

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలనను గాలికి వదిలేసి ఎవరికి చెప్పా పెట్టకుండా గోప్యంగా అమెరికాకు వెళ్లిన మేయర్ సునీల్ రావును జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు కోరారు. ఎవరికి తెలియకుండా గోప్యంగా విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కరీంనగర్ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేయర్ సడన్ గా అమెరికా పర్యటనకు వెళ్లడంతో నగర ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మేయర్ బాధ్యతలు ఇతరులకు అప్పగించకుండా ఎవరికి తెలియకుండా అంతుచిక్కకుండా విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని మండిపడ్డారు.

స్మార్ట్ సిటీ పనుల్లో దోచుకున్న డబ్బును అమెరికాలో దాచడానికి వెళ్ళాడనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారని.. ఇది నిజమేనా.. నిజమే అయితే.. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేక కరీంనగర్ అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తే బహిరంగంగా ప్రకటించాల్సి ఉండేదన్నారు. దొంగ చాటున వెళ్లడంలో అసలు ఉద్దేశం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు ఇంకా అనేక ఆరోపణలు మూట కట్టుకున్న మేయర్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 15 రోజులకు పైగా అధికారిక విధులకు హాజరు కాకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం ఇన్చార్జి మేయర్ బాధ్యతలు డిప్యూటీ మేయర్ కు లేదా కలెక్టర్ కు అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ నిబంధన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమెరికా వెళ్ళిన మేయర్ సునీల్ రావును కలెక్టర్ తక్షణమే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కోరారు. కరీంనగర్ లో అనేక సమస్యలు చుట్టుముట్టిన వేళ అనుకోకుండా సడన్ గా అమెరికాకు వెళ్లడం.. ఇన్చార్జి మేయర్ బాధ్యతలు ఇతరులకు అప్పగించకపోవడం దారుణమని విమర్శించారు. ఇతరులకు బాధ్యతలప్పగిస్తే తన పదవికి ఎసరు వస్తుందని భావనతోనే ఎవరికి బాధ్యతలు అప్పగించకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. కరీంనగర్లో పందులు దోమల స్వైర విహారం ప్రజలంతా విష జ్వరాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పరిశుభ్రత పై దృష్టి పెట్టకుండా విలాసం కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు.

కరీంనగరంలో గత ప్రభుత్వ పాలనలో మంజూరైన స్మార్ట్ సిటీ పనులు అద్వానంగా చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో మేయర్ కీలక పాత్ర పోషించాలని, ఎక్కడ అవినీతి బయటపడుతుందోనని భయపడు తున్నారని పేర్కొన్నారు. మేయర్ అమెరికా పర్యటనపై బీజేపీ కార్పొరేటర్లు పెదవి విప్పకపోవడం వారి మధ్య ఉన్న బంధం బయటపడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులపై ఒంటి కాళ్లు పై లేచే బిజెపి నాయకులు, ఆ పార్టీ కార్పొరేటర్లు మేయర్ అమెరికా పర్యటనపై ఎందుకు స్పందించడం లేదో వివరణ ఇవ్వాలని వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు.