బిజెపి నుంచి సస్పెండ్ చేయాలి..
కఠిన చర్యలు తీసుకోవాలి..
మోడీ అమిత్ షా.. స్పందించకపోవడం దారుణం
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, (విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ ను ఆ పార్టీ నుంచి అధిష్టానం వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. తన్వీదర్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
బుధవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బిజెపి పెద్దల అండతో రెచ్చిపోయి తన్వీదర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ వాక్యాలను ఢిల్లీ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి పెద్దలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాహుల్ గాంధీనీ బయటకు వస్తే చంపేస్తామని, మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బిజెపి నేత తన్వీదర్ సింగ్ బహిరంగంగా మాట్లాడినా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో స్పందించలేదని, అంటే తన్వీదర్ సింగ్ వెనుక ఉండి వీరే అలా మాట్లాడించి ఉంటారనే అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉందని, అలాంటి వారిని విడిచి పెట్టవద్దని సూచించారు.
తన్వీదర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. 18వ తేదీన బుధవారం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వరుసగా చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్య వాదుల మద్దతుతో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలనీ కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.