కరీంనగర్: ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు పొందిన 30 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం బీఆర్ఎస్ కు నచ్చలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులను అవమానించినట్లు ఎక్కడ మాట్లాడలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో పీజీలు, పీహెచ్డీలు చేసిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారని పేర్కొన్నారు. వినోద్ కుమార్ సీఎం వాక్యాలను తప్పుగా అర్థం చేసుకున్నారని మండిపడ్డారు.
విద్య హక్కు చట్టాన్ని బీఆర్ఎస్ సరిగా అమలు చేయలేక తుంగలో తొక్కిందని, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ చట్టం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవ చేశారు. వారి హాయంలో విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే విద్యారంగం ఆనాడే బాగుపడదని సూచించారు. 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో విద్యాహక్కు చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ చట్టం గురించి మాట్లాడడం వింతగా ఉందని పేర్కొన్నారు. విద్యారంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బడ్జెట్లో 21 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.