వికారాబాద్, జూలై 15(విజయక్రాంతి): జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చిన ఓ పర్యాటక బృందం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నది. సోమవారం హైదరాబాద్‌కు చెందిన కొందరు పర్యాటకులు మహేంద్ర థార్ వాహనాల్లో ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు కాలువ దాటుతున్న సమయంలో మూడు థార్ వాహనాలు బురద నీటిలో కూరుకపోయాయి. ఎంతకీ బయటకి రాకపోవడంతో పక్క గ్రామం నుంచి ఓ ట్రాక్టర్‌ను తీసుకొచ్చి బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ సైతం బురదనీటిలో కూరుకపోవడంతో మొత్తం నాలుగు వాహనాలు అక్కడే ఉండి పోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువల్లో వరద ఉధృతి పెరిగింది. వరద ఉధృతి అధికంగా ఉన్నందున పర్యాటకులు ఎవరు ప్రాజెక్టు వైపు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నా పర్యాటకులు వస్తుండటంతో ఇలాంటి సమస్యలు తలెత్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.