- అందినకాడికి దోచుకుంటున్న దారిదోపిడీ ముఠా అరెస్టు
- వివరాలు వెల్లడించిన డీసీపీ చంద్రమోహన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను హుమాయున్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆదివారం మోహదీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇటీవల ఓరోజు రాత్రి సమయంలో మాసబ్‌ట్యాంక్‌కు చెందిన శ్రీమంత్‌కుమార్ తన నలుగురు స్నేహితులతో కలిసి కారులో విజయనగర్ కాలనీలోని ఓ హోటల్‌కు భోజనం చేయడానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నిందితులు కారును ఆపి కత్తితో బెదిరించి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక బంగారు గొలుసు, ఒక బంగారు ఉంగ రం దొచుకొని పారిపోయారు. దీంతో బాధితులు హుమాయున్ నగర్ పీఎస్‌లో ఫిర్యా దు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు నాంపల్లికి చెందిన సాహెల్ ఫర్దీన్ ఖాన్(21), హుమాయున్‌నగర్‌కు చెందిన నేరాటి ప్రశాంత్(22), కొల్లూరి సాయి(22), విజయనగర్‌కాలనీకి చెందిన పెయ్యాల రాజశేఖర్ (26), మహ్మద్ ఖలీల్(22), గిమ్కా అభిలాష్ మోహన్(19), ఒక మైనర్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు.
వారి నుంచి 1 ఆపిల్ ల్యాప్‌టాప్ (బాధితుడికి చెందినది), ఒక బంగారు గొలుసు, ఒక పదునైన ఆయుధం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనూ పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీ సులు గుర్తించారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.