26-04-2025 01:13:34 AM
అందజేసిన హడ్కో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజన సరఫరా కోసం హడ్కో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు వాహనాలను అందజేశాయి. ప్రఖ్యాత సంస్థలైన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో), ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కుదిరింది. హడ్కో అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అధునాతన వంటగది పరికరాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల రూపంలో దాదాపుగా రూ.88 లక్షల విలువైన పరికరాలను విరాళంగా అందించింది. వాటిలో ఐదు రైస్ స్టీమర్లు, రెండు మల్టీఫంక్షనల్ పీలర్లు, చింతపండు ఒలిచే యంత్రం, మూడు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.
ఇవి సంగారెడ్డి జిల్లాలోని అధునాతనమైన కంది కిచెన్ కేంద్రం నుంచి భోజనాల సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఈ కార్యక్రమం ప్రారంభానికి హడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వి.రెడ్డి, అశిష్, సయ్యద్ రహీముద్దీన్ (జూనియర్ జనరల్ మేనేజర్లు) హాజరయ్యారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వారు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భోజనం సరఫరా కోసం వాహనాన్ని అందజేసింది. దీని ద్వారా రోజుకు సుమారు 2,500 భోజనాలు పంపిణీ చేయగలుగుతుంది. ప్రతి సంవత్సరం 5,80,000 లకు పైగా భోజనాలు హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థులకు అందుతాయి. కాగా ఈ రెండు సంస్థలకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్ కృతఙ్ఞతలు తెలిపారు.