calender_icon.png 25 September, 2024 | 5:56 PM

దసరా సీజన్‌లో వాహనాల అమ్మకాల జోరు

24-09-2024 12:00:00 AM

కంపెనీలు అంచనాలు

కొత్త మోడల్స్‌కు కస్టమర్ల ప్రాధాన్యత

 ముంబయి: ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల సీజన్‌లో వాహనాల విక్రయాలు భారీగా పెరగనున్నాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రుల రోజుల్లో దాదాపు 4వేల వాహనాలు డెలివరీ కానున్నాయి. వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వాహనాల డెలివరీ భారీగా పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఈ కాలంలో 3400 వాహనాలు డెలివరీ అయ్యాయి. డీలర్ల నివేదిక ప్రకారం.. ఈ సారి 1800 ఫోర్ వీలర్స్, 2200 ద్విచక్ర వాహనాలు డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా.

వాస్తవానికి హిందువులు దేవీ శరన్నవరాత్రులను శుభప్రదమైనవిగా భావిస్తారు. చాలామంది వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే పలువురు వాహనాల కో సం అడ్వాన్స్ బుకింగ్ సైతం చేసుకుంటున్నా రు. ఈ సారి నవరాత్రులతో పాటు ధన్‌తేరస్, దీపావళితో సహా ఇతర పండుగల సీజన్‌లో  భారీగా వ్యాపారం జరుగుతుందని అంచనా. లగ్జరీ వాహనాల బుకింగ్స్ సై తం పెద్ద ఎత్తున జరిగాయి.50 లక్షలకుపైగా విలువైన 500 వాహనాలు బుక్ అయ్యా యి. గతేడాది ఇలాంటి వాహనాలు 361 మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు.

వాహనాల రిజిస్ట్రేషన్‌తో రవాణా శాఖకు ఆదాయం సైతం పెరగనున్నది. మహీంద్రా కంపెనీ జనరల్ మేనేజర్ సంతోఖ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వాహనాలు తొలి నుంచి ఎక్కువగానే విక్రయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవరాత్రుల్లోనూ భారీగానే అమ్మకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎక్కువ మంది కొత్త మోడల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని టాటా మోటార్స్ వీరేంద్ర సింగ్ తెలిపారు.

ఈ సారి హైబ్రిడ్ వాహనాల బుకింగ్లో భారీ పెరుగుదల కనిపిస్తుందని.. దీనికి కారణం 100శాతం పన్ను మినహాయింపేనని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 హైబ్రిడ్ వాహనాలు బుక్ అయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం డిమాండ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈవీ వాహనాల తయారీలో కంపెనీలకు ఈ ఏడాది ఇబ్బంది లేదని.. సెమీకండక్టర్ల లభ్యత పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో వాహనాలు సకాలంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.