calender_icon.png 16 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెహికిల్ పొల్యూషన్!

16-03-2025 01:36:43 AM

  1. హైదరాబాద్‌లో భారీగా వాహన కాలుష్యం 
  2. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే చాలా ఎక్కువ
  3. 2022-24 మధ్య 8 రెట్లు పెరుగుదల
  4. వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నా అధ్వాన పరిస్థితి
  5. కాలుష్యంలో ద్విచక్ర వాహనాల వాటా 56శాతం

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ఢిల్లీ, బెంగళూరు, పుణెతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ వాహనాలు ఉన్నప్పటికీ ఆయా నగరాలతో పోల్చితే మన నగరంలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ప్రజారవాణా దారుణంగా ఉండటం వల్లే హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది.

రాష్ట్ర రాజధానిలో వాహన కాలుష్యం కారణంగా నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాల స్థాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. మెట్రో విస్తరణ లేకపోవడంతోపాటు ఎంఎంటీఎస్ సర్వీసులు అంతంత మాత్రంగానే ఉండటం, సిటీ బస్సుల సంఖ్య కూడా తగినంత లేకపోవడంతో కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. 

8 రెట్లు పెరిగిన వాహన కాలుష్యం

2022-24 మధ్య హైదరాబాద్‌లో కాలుష్యం స్థాయి సాధారణం కంటే 5-8 రెట్లు పెరిగిందని పీసీబీ డేటా ద్వారా తెలుస్తుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన దాని కంటే హైదరాబాద్‌లో కాలుష్య కారకాల స్థాయిలు భారీగా ఉన్నా యి. క్యూబిక్ మీటర్ గాలిలో 10 మైక్రోగ్రాములు ఉండాల్సిన నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం 4 రెట్లు కంటే ఎక్కువగా 48 మైక్రో గ్రాములు నమోదైంది.

ఢిల్లీలో 1.4 కోట్ల వాహనాలు, బెంగళూరులో 1.2 కోట్లు, పుణెలో 82 లక్షల వాహనాలు ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం 80 లక్షల వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఆయా నగరాల్లో ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌తో పోలిస్తే క్యూబిక్ మీటర్ గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం ఢిల్లీ 28 మైక్రోగ్రామలు, బెంగళూరు 34 మైక్రోగ్రాములు, పుణెలో 27 మైక్రోగ్రాములే ఉంది.

నగరంలో నిత్యం 1500 టన్నుల మేర కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు విడుదలవుతున్నాయి. పైన పేర్కొన్న ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఈ వాయువులు విడుదలవుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి.

దిచక్ర వాహనాల ద్వారానే దాదాపు 56 శాతం కంటే ఎక్కువ కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. గడువు తీరిపోయిన వాహనాల వాడకమూ కాలుష్యం విపరీతంగా పెరగడానికి ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. 

ప్రజారవాణా సక్రమంగా లేకే...

నగరంలో ప్రజారవాణా సక్రమంగా లేకపోవడంతో చాలా మంది స్వంత వాహనాలపైనే తమ పని ప్రదేశాలకు వెళ్తున్నారు. బెంగళూరులో 7వేల సిటీ బస్సులున్నాయి. అక్కడ మెట్రో ద్వారా నిత్యం 7లక్షల మంది ప్రయాణిస్తారు. ఢిల్లీలో 6వేలకు పైగా ప్రభుత్వ సిటీ బస్సులు నడుస్తాయి. ఢిల్లీ మెట్రో ద్వారా రోజుకు 78 లక్షల మంది ప్రయాణం సాగిస్తారు.

ముంబైలో నిత్యం 75లక్షల మందిని లోకల్ రైళ్లు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. బెస్ట్ పేరిట నడిచే సిటీ బస్సులు సైతం అక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ముంబైలో మెట్రో సేవలను ప్రతిరోజు సుమారు 5లక్షల మంది వినియోగించుకుంటున్నారు. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో కేవలం 2500 సిటీ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.

ఇక్కడి లోకల్ రైళ్లు కేవ లం 50వేల మందికి మాత్రమే సేవలందిం చే విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో మె ట్రో సేవలను నిత్యం 4.5లక్షల మందికిపైగా వినియోగించుకుంటున్నారు. ఫలి తంగా నగరంలోని 90శాతం మంది ప్రజలు సొంత వాహనాల్లోనే తమ పని ప్రదేశాలకు చేరుకుంటున్నారు.

ఇందులో ద్విచక్ర వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో నగరంలో విపరీతమైన రద్దీతోపాటు కాలుష్యం పెరుగు తోంది. రాష్ట్ర రాజధానిలో కాలుష్యంతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే ప్రజా రవాణాను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వాహనరంగ నిపుణుడు గంగాధర్ విజయక్రాంతికి తెలిపారు.