15-03-2025 12:00:00 AM
కరోనా, రాజకీయ వ్యవహారాల దృష్ట్యా టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైన్ చేసిన సినిమాలు అనుకున్న సమయంలో పూర్తి కావటంలేదు. ఫలితంగా అటు ఆయన అభిమానులకు, ఇటు సినీప్రియులకు ఎదురుచూపులు తప్పటంలేదు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ ఏడాది విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో ఇదీ ఒకటి.
ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్న ఈ సినిమాలో చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్‌కల్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక కాగా.. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి పాత్రను పోషించనున్నారు. అనుపమ్‌ఖేర్, జిషుసేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మేకర్స్ మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇంకా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికానందున విడుదలను వాయిదా వేశారు. వచ్చే మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవోపీ: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; సంగీతం: కీరవాణి; నిర్మాత: ఏ దయాకర్‌రావు; దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ.