13-04-2025 12:21:08 AM
టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు.
తొలుత ఈ ప్రాజెక్టును క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో కొంత భాగం చిత్రీకరించారు. కరోనా, పవన్‌కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు.
అయితే, తాజా ప్రచారం నేపథ్యంలో మేకర్స్ మరోమారు సామాజిక మాద్యమాల వేదికగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నాం. ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. చిత్రబృందం ఎక్కడా రాజీ పడకుండా గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది’ అని నిర్మాత ఏ దయాకర్‌రావు పేర్కొన్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; సంగీతం: కీరవాణి.