calender_icon.png 27 October, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రుని కోవెల వెలవెల!

27-10-2024 12:00:00 AM

    1. నాడు ధూప దీప నైవేద్యాలతో కళకళ
    2. గుప్తనిధుల తవ్వకాలతో రాళ్లగుట్టగా గుడి
    3. ఆక్రమణల చెరలో ఆలయ మాన్యాలు
    4. నిరాదరణకు గురైన కాకతీయుల శిల్పాకళా సంపద
    5. నేటి ప్రభుత్వమైనా స్పందించాలని భక్తుల విజ్ఞప్తి
    6. ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాలని వేడుకోలు
  1. గుప్తనిధుల తవ్వకాలతో రాళ్లగుట్టగా గుడి

ఎటుచూసినా అపురూపమైన శిల్పాలు.. బండరాతితో ప్రాకారాలు.. అద్భుతమైన ద్వారాలు.. భక్తిపారవశ్యాన్ని కలిగించే ఏకశిల శివలింగాలు.. చూడగానే కట్టిపడేసే కాకతీయుల నాటి అద్భుత శిల్పకళా సౌందర్యానికి తార్కాణం నాగులపహాడ్‌లోని త్రికూటేశ్వర (తెల్లగుడి), వీరభద్రస్వామి (నల్లగుడి) ఆలయాలు. వీటిని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని కాకతీయ పాలనాధీశుల సామంత రాజు, రేచర్ల వంశీయుడు కాట్రెడ్డి నిర్మించాడు.

ఆలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. మూడు దశాబ్దాల క్రితం ప్రభు త్వం కేటాయించిన నిధులతోపాటు భక్తులు సేకరించిన నిధులతో త్రికూటేశ్వర ఆలయ జీర్ణోద్ధరణ కల సాకార మైంది. తిరిగి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి. కానీ, నల్లగుడి మాత్రం నిరాదరణకు గురైంది. గుప్తనిధుల కోసం దుండుగులు ఆలయాన్ని ఇప్పటికే ఛిద్రం చేశారు.

ఫలితంగా ఆలయం రాళ్లగుట్టగా మారింది. ఒకప్పుడు ధూప దీప నైవేద్యాలతో తులతూగిన ఆల యం ఇప్పుడు వెలవెలబోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. జీర్ణోద్ధ రణకు పూనుకొని ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

సూర్యాపేట / పెన్‌పహాడ్, అక్టోబర్ 26: కాకతీయుల అద్భుత శిల్పకళా సౌందర్యానికి తార్కాణం సూర్యాపేట జిల్లాలోని నాగులపహాడ్‌లోని త్రికూటేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలు. వీటిలో త్రికూటేశ్వరస్వామి ఆలయా న్ని తెల్లగుడి అని, వీరభద్రస్వామి ఆలయాన్ని నల్లగుడి అని భక్తులు పిలుస్తారు.

కాకతీయుల సామంత రాజు, రేచర్ల వంశీయుడు కాట్రెడ్డి ఈ ఆలయాలను నిర్మించాడు. ఆలయాలకు వందలాది ఏళ్ల చరిత్ర ఉన్నది. కాలక్రమేణా రెండు ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నా యి. భక్తులు సేకరించిన నిధులు, ప్రభుత్వం కేటాయించిన నిధులతో మూడు దశాబ్దాల క్రితం త్రికూటేశ్వర ఆలయ జీర్ణోద్ధరణ జరిగిం ది. కానీ వీరభద్రస్వామి ఆలయం నిరాదరణ కు గురైంది.

గుప్తనిధుల కోసం దుండుగులు ఇప్పటికే ఆలయాన్ని ధ్వంసం చేశారు. నాటి అందమైన శిల్పాలు సైతం ముక్కలు చెక్కలయ్యాయి. ఆలయం ఇప్పుడు రాళ్లగుట్టగా దీనావస్థలో దర్శనమిస్తున్నది. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో తులతూగిన ఆల యం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఇప్పటికైనా సర్కార్ స్పందిం చి జీర్ణోద్ధరణకు పూ నుకొని ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

చెల్లాచెదురు..

వీరభద్రస్వామి (నల్లగుడి) గుడి శిథిలావస్థకు చేరుకుని ఉనికిని కోల్పోయే ప్రమాదం లో ఉంది. ఆలయ ప్రాంగణం ఇప్పుడు కంపచెట్లతో మూసుకుపోయింది. ఇటీవల దుండ గులు గుప్తనిధుల కోసం గర్భగుడిలోని వీరభద్రస్వామి, నటరాజ విగ్రహాలతో పాటు శివ లింగాన్ని పెకలించే యత్నం చేశారు.

ప్రస్తుతం నందీశ్వరుడి కింద ఉన్న రాళ్లు చెల్లాచెదురై దర్శనమిస్తున్నాయి. గర్భగుడి అడుగు భాగం ఛిద్రమై కనిపిస్తున్నది. ఆలయ ప్రాకారాలపై చెక్కిన శిల్పాలు, శాసనాలు నిజాం కాలంలోనే కొంత ధ్వంసం కాగా, కాలక్రమేణా గుప్తనిధు ల వేటలో దుండగులు కూడా కొన్ని శిల్పాలను ధ్వంసం చేశారు.

ఆలయాల మధ్యలో మజీద్

త్రికూటేశ్వరుడు, వీరభద్రస్వామి ఆలయా ల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిజాం హయాంలో చిన్న మజీద్ నిర్మాణం జరిగింది. నిజాం పాలన తర్వాత ఆ మజీద్ సైతం శిథిలావస్థకు చేరింది. 

మాన్యాల సంగతి దేవుడికే ఎరుక.. 

ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు నాటి పాలకులు మూసీ ఆయకట్టు, నామ సము ద్రం, విశ్వనాథ సముద్ర ప్రాంతంలో వందలా ది ఎకరాలు కేటాయించారు. ఇదే విషయాన్ని అనేక శాసనాలూ వెల్లడిస్తున్నాయి. ఆలయాల పోషణార్థం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పెద్దఎత్తున మాన్యాలు కేటాయించిన ట్లు శాసనాలు చెప్తున్నాయి. కానీ ఆ మాన్యా లు ఎవరి పాలయ్యాయో తెలియని పరిస్థితి.

ప్రస్తుతం ఆలయాలకు ఆనుకుని ఉన్న భూ ములతో పాటు గర్భగుడి సైతం కొందరు కబ్జాదారులు పేరున పట్టా  అయి ఉండడం గమనార్హం. రెవెన్యూ రికార్డుల్లో సైతం ఆలయ భూముల లెక్కలు లేవు. దీంతో వీరభద్రస్వామికి క్రమంగా ధూపదీప నైవేద్యాలు కరువ య్యాయి. 

తెలంగాణ ఏర్పడిన కొత్తలో నాటి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేయించినట్లు ప్రచారం జరిగింది. ఆ నిధులు ఎటుపోయాయో? అభివృద్ధి సంగ తి ఏమైందో..? ఇప్పటికీ తెలియరాలేదు.

ఎప్పటికప్పుడు పాలకులు వీరభద్రస్వామి ఆల యాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారే తప్ప.. జీర్ణోద్ధరణ సంగతి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వమైనా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

త్రిలింగాలతో త్రికూటేశ్వరాలయం..

సామంత రాజైన కాట్రెడ్డి తన తల్లిదండ్రు లైన నామిరెడ్డి, ఐతాంబకు పుణ్యఫలం అం దించేందుకు క్రీస్తుశకం 1,256లో పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్‌లో అ ద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో త్రికూటేశ్వ ర (తెల్లగుడి), వీరభద్రస్వామి (నల్లగుడి) ఆలయాలు నిర్మించాడు.

త్రికూటేశ్వరాలయం లో తన పేరు కాట్రెడ్డితో పాటు తల్లిదండ్రు ల పేర్లపై నామేశ్వర, ఐతేశ్వర, కాటేశ్వర అనే త్రిలింగాలను ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఆలయానికి త్రికూటేశ్వర ఆలయమని పేరు వచ్చిందని ప్రతీతి.

ఆలయ మండపం పైకప్పునకు ఆగ్నేయంలో గొర్రెపై అగ్నిదేవుడు, దక్షిణాన దున్నపోతుపై యముడు, నైరుతి లో నిరుత్తి రాక్షసుడు, పడమరన మొసలిపై వర్దుడు, వాయావ్యాన జింకపై వాయు దేవు డు, ఉత్తరాన మనిషిపై కుబేరుడు, ఈశాన్యా న నందిపై ఈశాన్యుడు కొలువుదీరేలా విగ్రహాలను చెక్కారు.

త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హంస, గరుత్మంతుడు, నంది వాహనంపై ఆశీనులై భక్తుల ఆశీస్సులు అందిస్తున్న రీతిలో ప్రతిష్ఠించిన విగ్రహాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి.  రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాల శిల్పాలు కనువిందు చేస్తున్నాయి.

1995లో పురావ స్తు శాఖ విడుదల చేసిన రూ.9.50 లక్షలతో ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. భక్తులు మరో రూ.10 లక్షలు సేకరించి త్రిలింగాలతో పాటు గోపురాలు,  ధ్వజస్తంభం,  నవగ్రహాలను చక్కదిద్దారు. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మించడంతో త్రికూటేశ్వరాలయంలో తిరిగి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి.  

నిధుల కేటాయింపుకు కృషి..

ఈ ప్రాంత వాసిగా నాగులపహాడ్ ఆలయాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. భక్తుల కోరిక మేరకు వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం పని చేస్తా. పర్యాటక శాఖ కార్పొరేషన్ ద్వారా నిధుల కేటాయించేందుకు కృషి చేస్తా. ఈ అంశాన్ని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ఏడాదిలోనే ఇచ్చిన హామీని నెరవేర్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా.

 పటేల్ రమేశ్‌రెడ్డి, రాష్ట్ర 

పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్

ఆలయాల చరిత్ర గొప్పది..

నాగులపహాడ్‌లోని ఆలయాల చరిత్ర చాలా గొప్పది. నేను పాతికేళ్లు త్రికూటేశ్వర ఆలయ అర్చకుడిగా సేవలు అందించా. ఒకప్పుడు కళకళలాడిన ఈ రెండు ఆలయాల్లో ఇప్పుడు వీరభద్రస్వామి ఆలయం నిరాదరణకు గురైంది. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి వీరభద్రస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కంకణం కట్టుకోవాలి. ఆలయ అభివృద్ధికి నిదులు మంజూరు చేయాలి. 

 ఇరువంటి యాదగిరి 

లక్ష్మీనర్సింహశాస్త్రి, పూర్వ అర్చకుడు