17-04-2025 12:46:48 AM
ఈ నెల 25న వేలాది మందితో చలో తాళ్ల రాంపూర్
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ముషీరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఎర్గట్ట మండ లం తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవి.రమణ, తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తి దారుల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యేలికట్టే విజయకుమార్ గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ లు మాట్లాడుతూ నిజమాబాద్ జిల్లాలో చట్ట విరుద్దంగా ఏర్పాటైన విడిసీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గౌడ మహిళను గుడి నుంచి గెంటి వేసి ఈత చెట్లను తగలబెట్టిన విడిసీ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. గత ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను, సాంఘీక బహిష్కరణ చేయటం అత్యంత దారుణమని దీన్ని కోర్టు సమోటోగా తీసుకొని నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విడిసీల ముసుగులో అరాచకాలకు పాల్పడుతూ దళిత బహుజనులను హింసకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసీలు, ఎమ్మెల్యేలు, ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని విమర్శించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు విడిసీల అరాచకాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించటం సరైనది కాదని అన్నారు. తాము చెప్పినట్లు వినని వారిపై సాంఘీక బహిష్కరణకు గురి చేయ టం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలను ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు న్యా యం చేయాలని కోరారు.
ఈ నెల 25 న గీత కార్మికులకు మద్దతుగా వేలాది మందితో ఛలో తాళ్ల రాంపూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత సంఘం ప్రధానకార్యదర్శి బెల్లం కొండ వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు పీ.ఆశయ్య ఎల్. బాలకృష్ణ, ఉడుత రవీందర్, ఎం .దశరథ్, వీరస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.