జేఎన్‌టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సీఎంకు బహిరంగ లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని జేఎన్‌టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు రాహుల్‌నాయక్, పవన్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆ సంఘం నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖను రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జేఎన్‌టీయూహెచ్ సహా పలు యూనివర్సిటీల్లో పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. యూనివర్సిటీల్లో సమస్యల వల్ల ఎంసెట్‌లో 1000లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులు కేవలం 32 మంది మాత్రమే మొదటి విడత కౌన్సిలింగ్‌లో జేఎన్‌టీయూలో చేరారని, యూనివర్సిటీల్లో చేరేందుకు కూడా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, సందీప్, బ్రహ్మంగౌడ్, శివకృష్ణ, విజయ్, సిద్దార్థ్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.