calender_icon.png 3 October, 2024 | 9:03 PM

మెప్మాలో వసూల్ రాణులు

03-10-2024 01:08:54 AM

లక్షల్లో కమీషన్ దండుకుంటున్న రిసోర్స్‌పర్సన్లు 

రుణం కావాలంటే మహిళా సంఘాలు కమీషన్ ఇవ్వాల్సిందే

ఏళ్లుగా కొనసాగుతున్న దందా

గజ్వేల్, అక్టోబరు 2: ఒక్కో రూపాయి పొదుపు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ మహిళా సంఘాల సభ్యులు తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడి ప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న మహిళా సంఘాలను కొన్నిప్రాంతాల్లో మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) రిసోర్స్‌ప ర్సన్లు కమీషన్లు వసూలు చేసి దోచుకుంటున్నారు.

ప్రభుత్వం వేలల్లో వేతనాలు అంద జేస్తున్నప్పటికీ పక్కదారి పడుతున్నారు. మహిళా సంఘాల నుంచి లక్షల రూపాయల కమీషన్ వసూలు చేస్తున్నారు. గజ్వేల్‌లో మెప్మా రిసోర్స్‌పర్సన్ల నిర్వాకంతో ప్రభుత్వం ఇచ్చే రుణాలు తీసుకోవడానికి మహిళా సంఘాలు విముఖత చూపడంతో పాటు తమ సంఘాలను కూడా రద్దు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందనే ప్రచారం జరుగుతోంది.

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 605 వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రూపులో పది మంది వరకు సభ్యులు ఉన్నారు. సంఘాలన్నీ సీనియారిటీ పొందడంతో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రుణాలు అందిస్తున్నారు.

మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయడంలో ముఖ్యపాత్ర వహించే రిసోర్స్‌పర్సన్లు ఇదే అదనుగా భావించి మహిళా సంఘాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. రుణాలు మంజూరు అవ్వగానే ప్రతి సంఘం వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు వాటా ఇస్తున్నామంటూ.. 

రుణం పొందిన మహిళా సంఘాలు కమీషన్ ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే.. రిసోర్స్‌పర్సన్లు కమీషన్‌లో కొంతభాగం తమతో పాటు తమ ఉన్నతాధికారులకు కూడా ఇస్తున్నామని చెబుతుండడం గమనార్హం. ఏళ్ల తరబడి మెప్మా రిసోర్స్ పర్సన్లుగా విధులు నిర్వహిస్తున్న వారు మహిళా సంఘాలకు రుణం వచ్చిన ప్రతిసారి కమీషన్ తీసుకుంటున్నా రంటే లక్షల్లో వసూలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది.

గత ఆర్థిక సంవత్సరంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.17 కోట్ల రుణాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.9 కోట్లకు పైగా వచ్చాయి. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 20 మంది రిసోర్స్ పర్సన్లు కలిసి మహిళా సంఘాల నుంచి రూ.13 లక్షలకు పైగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.5 లక్షలకు పైగా కమీషన్లు వసూలు చేశారన్నది మహిళా సంఘాలు చెబుతున్న మాట.

ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదంటే వారికి కూడా వాటాలు అందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించి దోపిడీని అరికట్టాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.