27-04-2025 05:46:47 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పీడీ సెట్ ఆల్ ఇండియా 17 ర్యాంకును కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ వైద్యురాలు సాధించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన డాక్టర్ సుచరిత ఇటీవల విడుదల చేసిన పీడీ సెట్ లో ఆలిండియా 17 ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ సుచరిత ఎంబిబిఎస్, గైనకాలజిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆలిండియా పిడి సెట్ లో 17వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుచరిత తండ్రి జెడ్పిహెచ్ఎస్ పెద్ద మల్లారెడ్డి బాలికల ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి చిత్ర కుమారి జెడ్పిహెచ్ఎస్ పెద్ద మల్లారెడ్డి బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పనిచేస్తున్నారు. డాక్టర్ సుచరిత పదవ తరగతి వరకు మెదక్ జిల్లా రామాయంపేటలోని మంజీరా విద్యాలయంలో చదువుకొని డివిజన్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివి 2015 సంవత్సరంలో జరిగిన ఎంసెట్ పరీక్షల్లో 249 ర్యాంకు సాధించి వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. పీజీ మహారాజ్ సుహేల్ దేవ్ మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నోలో పూర్తిచేసింది. చదువులో మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరిచి ప్రస్తుతం ఆలిండియా పిడిసెట్ 17వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. తల్లి తండ్రికి తగ్గ తనయురాలిగా అభినందించారు.