calender_icon.png 13 October, 2024 | 4:54 PM

బంగ్లాను ఆదుకున్న వరుణుడు

28-09-2024 12:00:00 AM

  1. రెండో టెస్టుకు వర్షం అంతరాయం
  2. చెలరేగిన ఆకాశ్, అశ్విన్

కాన్పూర్: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా మొదలైన రెండో టెస్టుకు తొలి రోజే వరుణుడు ఆటంకం కలిగించాడు. తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. ఒక పక్క పేసర్ ఆకాశ్ దీప్ చెలరేగగా.. అశ్విన్ తన స్పిన్ ఉచ్చులో బంగ్లా బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.

ఈ తరుణంలో వరుణుడు అడ్డు తగలడంతో రెండు సెషన్ల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తొలిరోజే బంగ్లాను ఆలౌట్ చేయాలన్న కోరిక నెరవేరలేదు. ఫలితంగా రెండో టెస్టు మొదటిరోజు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మొమినుల్ హక్ (40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

ఆకాశ్ దీప్ 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ గెలిచి భారత సారథి రోహిత్ శర్మ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగగా.. బంగ్లా దేశ్ రెండు మార్పులు చేసింది. మైదానం చిత్తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమయింది. టాస్ అనంతరం వరణుడు ఆటంకం కలిగించడంతో తొలి సెషన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయింది.  

కుంబ్లేని దాటిన అశ్విన్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్ ఆకాశ్ దీప్ చుక్కలు చూపించాడు. ఆరంభంలోనే ఓపెనర్ హసన్ వికెట్‌ను తీసిన ఆకాశ్ నిలకడగా ఆడుతున్న షాదమన్ ఇస్లామ్ (24)ను పెవిలియన్ చేర్చాడు.  తర్వాత వచ్చిన కెప్టెన్ శాంటో (31)తో కలిసి మొమినుల్ (40*) మరో వికెట్ పడకుండా చాలా సేపు జాగ్రత్త పడ్డాడు.

కానీ ఈ దశలో బంతిని అందుకున్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్  శాంటోను బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ చరిత్రలకెక్కాడు. అనిల్ కుంబ్లే (419) పేరిట ఉన్న రికార్డును అశ్విన్ (420) దాటేశాడు.

ముత్తయ్య మురళీధరన్ (612) వికెట్లతో ఆసియాలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్ వీరాభిమాని ‘టైగర్ రాబీ’ ఆసుపత్రి పాలయ్యాడు. రెండో టెస్టు చూసేం దుకు వచ్చిన రాబీని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.