రాబడి కోసం రాబందులా మారిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని 10 ఏళ్లలో అన్ని రంగాల్లో ముందు నిలబెట్టిన కేసీఆర్
పది నెలల్లోనే అడ్రస్ లేకుండా చేశారు
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దళారులతో కుమ్మక్కు
రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు
అడ్రస్ లేని ఆరు గ్యారంటీలు
గజ్వేల్ (విజయక్రాంతి): కేసీఆర్ ను లేకుండా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆంధ్రాలో కలిపేస్తారా అంటూ మాది ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ ఎన్.సి. రాజమౌళితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో కెసిఆర్ నిలిపితే, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పులతో అడ్రస్ లేకుండా పోతుందన్నారు. పది నెలల్లోనే రూ.80 వేలకోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు కేసీఆర్ ను లేకుండా చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో యాదాద్రి, కాలేశ్వరం, సెక్రటేరియట్, జిల్లాకు కలెక్టరేట్, క్యాంప్ ఆఫీసులు, మెడికల్ కాలేజీలను, సంక్షేమ పథకాలను లేకుండా చేస్తారా అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి అడుగడుగునా తెలంగాణలో దర్శనమిస్తుందన్నారు.
కరువులో ఉన్న తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేనన్నారు. రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, పోలీసులు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో రోడ్డెక్కుతున్నారని, త్వరలో కోటి యాభై లక్షల మహిళలు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైందని, అందరి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిందన్నారు. హైడ్రాతో ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారని, సరైన విధివిధానాలు లేకుండా పాలన సాగుతుందన్నారు. ఎక్సైజ్, విద్యుత్, ఆర్టీసీ ధరలు కూడా పెంచుతామంటున్నారన్నారు. రాబడి కోసం రాష్ట్రంపై రాబందులా పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి పై ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రతిపక్షం బలంగా ఉందని ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల ఇలా అమలులో విఫలమయ్యారని, ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా అమలు కాక రైతులంతా ఇబ్బంది పడుతున్నారని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పత్తి కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల కోసం రైతు గర్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ నేరుగా రైతుల లోకి వెళ్లి సమస్యలను పరిశీలించి పరిష్కరించడానికి ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియుద్దిన్, కౌన్సిలర్ బాలమణి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, నాయకులు కనకయ్య, మల్లేశం, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.