- 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు
- రాజస్థాన్‌లోని కోటా, లబాన్ స్టేషన్ల మధ్య ప్రయోగం
న్యూఢిల్లీ, జనవరి 3: వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు వేగాన్ని క్రమంగా పెంచేందుకు ట్రయల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో వందేభారత్ స్లీపర్ రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.
ఈ మేరకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. కోటా లబాన్ స్టేషన్ల మధ్య రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.