- నాగ్‌పూర్ మార్గంలో ప్రయాణికులు కరువు
- 75 శాతం కూడా నిండని సీట్లు
- పునరాలోచనలో పడిన రైల్వే శాఖ అధికారులు
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 16న అట్టహాసంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికులు కరువయ్యారు. ఉత్తరాదిన పలు చోట్ల వందేభారత్ రైళ్లకు ఆశించినంతగా స్పందన లేకపోయినా.. దక్షిణాదిన సికింద్రాబాద్ పరిధిలో వందే భారత్‌కు ప్రయాణికుల విశేష స్పందన లభించింది.
కానీ నాగ్‌పూర్ రైలు పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రయాణికుల నుంచి నిరాదరణకు గురవడంతో రైల్వే అధికారులు ఈ రైలుపై పునరాలోచనలో పడ్డారు. రెండు వైపులా రోజువారీ 75 శాతం మేర సీట్లు కూడా నిండటం లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంత తక్కువ ఆక్యుపెన్సీ నమోదవడం రైల్వే అధికారులను షాక్‌కు గురి చేసింది.
75 శాతం ఖాళీనే..
వందేభారత్ రైలు మొత్తం సామర్థ్యం 1,440 సీట్లు. కాగా ఈ నెల 10న నాగ్‌పూర్ రూట్లో ఈసీ 45, ఏసీ 804 సీట్లు ఖాళీగా ఉన్నాయి.11వ తేదీన ఈసీ 66, ఏసీ 1040, 13వ తేదీన ఈసీ 73, ఏసీ 1148 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ వచ్చే రైలులో 10వ తేదీన ఏసీ 572, ఈసీ 1 సీట్లు, 11వ తేదీన ఏసీ 840, ఈసీ 50 సీట్లు, 13వ తేదీన ఏసీ 1,110, ఈసీ 62 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కొన్ని గంటల్లో బయలుదేరుతుందనగా కూడా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయ ని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో రైల్వే శాఖ పునరాలోచనలో పడింది. మరోవైపు ఈ రైలు తెలంగాణలో కేవలం కాజీపే ట, రామగుండంలో మాత్రమే ఆగుతుంది.
బెల్లంపల్లి, పెద్దపల్లి జంక్షన్‌లలో ఆపితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంద ని ప్రయాణికులు అంటున్నారు. ఈ మేరకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రైల్వే అధికారులకు ఇప్పటికే వినతిపత్రం కూడా సమర్పించారు.
ఆ రూట్లలో భారీ డిమాండ్..
మరోవైపు జంట నగరాల నుంచి యశ్వంత్‌పూర్ (బెంగళూరు), విశాఖపట్నం, తిరుపతి వెళ్లే వందే భారత్ రైళ్లు అధిక డిమాండ్‌తో నడుస్తున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేట్లు 90 నుంచి 100శాతం మధ్యన ఉంటోంది. వారాంతాల్లో సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. సోమవారాల్లో విశాఖపట్నం, యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటున్నాయి.
ఎంతో డిమాండ్ ఉన్న ఈ రైళ్లకు బోగీల సంఖ్య తక్కువగా ఉంటోంది. అందుకే 10 బోగీలతో నడుస్తున్న నాగ్‌పూర్ సికింద్రాబాద్ వందేభారత్ రైలు బోగీలను తగ్గించి యశ్వంత్‌పూర్, తిరుపతి, విశాఖ రైళ్లకు పెంచాలని ప్రయాణికులు కోరుత్నునారు.
అధికారులు సైతం త్వరలోనే నాగ్‌పూర్ వందేభారత్ కోచ్‌ల సంఖ్యను తగ్గించే దిశగా ఆలోచిస్తున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. సుమారు 500 సీట్ల స్థాయికి తగ్గించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని డీఆర్‌యూసీసీ సభ్యుడు గోపాల్ విజయక్రాంతికి తెలిపారు.