calender_icon.png 22 September, 2024 | 7:04 AM

నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్

16-09-2024 04:57:54 AM

  1. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  2. 7 గంటల్లోనే నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు 

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): భారతీయ రైల్వేకు గర్వకారణమైన వందే భారత్ రైలు సేవలు నాగ్‌పూర్ మధ్య కూడా ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 16న తేదీన సోమవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభిస్తారని పేర్కొంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి రెగ్యులర్ సర్వీసు ప్రారంభమయ్యే నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 585 కిలోమీటర్ల దూరాన్ని 7.15 గంటల్లో చేరుకుంటుందని స్పష్టం చేసింది. ఈ రైలులో 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, 18 చైర్ కార్ కోచ్‌ల్లో మొత్తం 1440 సీట్లు ఉంటాయని వెల్లడించింది.

ఈ రైలులో ప్రయాణికులు నాగ్‌పూర్, బల్హర్షా, ఇతర పట్టణాల నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి పగటిపూట ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. 20101 రైలు నంబర్ గల నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 20102 రైలు నంబర్‌తో సికింద్రాబాద్ నుంచి 1 గంటకు బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుందని తెలిపింది. మార్గం మధ్యలో సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. సోమవారం ప్రారంభించే నాగ్‌పూర్ సికింద్రాబాద్ వందేభారత్ ద.మ.రైల్వే జోన్ పరిధిలోనే అత్యధిక కోచ్‌లతో (20) నడిచే తొలి రైలు కానుంది. 

వ్యాపారానికి అనుకూలంగా..

నాగ్‌పూర్ సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలు వల్ల మహారాష్ర్ట, తెలంగాణను కలుపుతూ రెండు ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. మహారాష్ర్టలోని విదర్భ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రమైన రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్‌లతో కలుపుతుందని రైల్వే శాఖ తెలిపింది.  

అధునాతన సౌకర్యాలు..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆన్-బోర్డ్ వై-ఫై, ఇన్ఫోటైన్‌మెంట్, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, ఖరీదైన ఇంటీరియర్స్, టచ్ ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో వాక్యూమ్ టాయిలెట్‌లు, డిఫ్యూజ్డ్ ఎల్‌ఈడీ లైటింగ్, ఛార్జింగ్ పాయింట్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. వ్యక్తిగత టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు, మెరుగైన హీట్ వెంటిలేషన్, అత్యాధునిక ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, యూవీ ల్యాంప్‌తో జెర్మ్ ఫ్రీ ఎయిర్ వెంటిలేషన్ ఉంటుంది. ప్రతి లోకోలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కవచ్ టెక్నాలజీతో భద్రతలో మేటిగా నిలుస్తుందీ వందేభారత్. 

ఇప్పటివరకు 54 రైళ్లు..  

2019 ఫిబ్రవరి 15న ప్రారంభించినప్పటి నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల పురోగతికి చిహ్నంగా మారింది. ఈ సెమీ -హై-స్పీడ్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. లక్షలాది మంది ప్రయాణికులకు అసమానమైన ప్రయాణ అనుభూతిని అందిస్తున్నది. ఈ నెల 14 నాటికి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 54కు (108 సర్వీసులు) చేరుకుంది. వందేభారత్ రైళ్లు ఇప్పటివరకు మొత్తం 36,000 ట్రిప్పులను పూర్తి చేశాయి. 3.17 కోట్ల మంది ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేర్చాయి. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 280 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేస్తూ ప్రయాణించాయి.