calender_icon.png 15 January, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి విఠలేశ్వరుడు!

13-09-2024 12:00:00 AM

పండరీపుర పాండురంగడే

దివాను గోవిందు నాయక్ :

వనపర్తి సంస్థానంలో దివానుగా పని చేసిన గోవిందు నాయక్ అనే మహాభక్తుని పుణ్యమా అని సాక్షాత్తు పండరీపురంలోని శ్రీపాండురంగ విఠలుడే ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. 

ఎంతో అరుదైన, అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో భీమానది ఒడ్డున కొలువై వున్న పండరీపురం. కరుణాంతరంగ ప్రభువుగా పేరొందిన ఇక్కడి శ్రీ పాండురంగ విఠలుడు అనేకమంది భక్తులకు నిత్య ఆరాధ్య దైవం. ప్రతీ సంవత్సరం లేదా కోరుకున్నప్పుడల్లా అంత దూరం వెళ్లలేని వాళ్లకోసం సుమారు నాలుగు దశాబ్దాల కిందటే మన రాష్ట్రంలోని వనపర్తిలో ఆ స్వామియే స్వయంభువుగా నెలవై ఉన్నాడు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవీధిలో వేలాదిమంది భక్తుల ఆరాధనలను అందుకుంటూ, అనన్యసామాన్యంగా వెలుగొందుతున్నాడు శ్రీ విఠలేశ్వరుడు.

దేశంలోనే రెండవదిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఆలయంగా చెప్పుకునే వనపర్తి స్వయంభు శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామి ఆలయం సంస్థానాధీశుల కాలంలోనే ఏర్పాటైంది. సుమారు 17వ శతాబ్దంలో దేవాలయంలో రుక్మిణీ సమేత విఠలేశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పండరీపుర పాండురంగ స్వామియే స్వయంగా వనపర్తిలో వెలసినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు.

దివాను గోవిందు నాయక్ పుణ్యమే

అప్పటి వనపర్తి సంస్థానంలో దివానుగా పని చేసిన గోవిందు నాయక్ పండరీపుర దైవం శ్రీ పాండురంగ విఠల స్వామి భక్తుడు. ఈ ఆలయ ప్రతిష్టకు ఆయనే స్వయంగా కృషి చేసినట్లు చారిత్రక పరిశోధకులు, స్థానికులు పేర్కొన్నారు. నాయక్ ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశికి అక్కడిదాకా వెళ్లి స్వామిని దర్శించుకుని వనపర్తికి వచ్చేవారు. వృద్ధాప్యంలో స్వామి దర్శనం కష్టమవుతుందనే భాధతో చివరిసారిగా అక్కడ మూడు రోజులపాటు ఆయన ధ్యానంలో గడిపారు. ఆశ్చర్యంగా, చివరి ఘడియల్లో విఠల్ స్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చాడట.  ‘వనపర్తి పరిసర ప్రాంతాల్లోనే నేను మీకు దర్శనమిస్తాను’ అని స్వయంభువు విగ్రహాల జాడను తెలిపాడు.

రుక్మిణీ సమేత విఠలుడు

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో శ్రీ పాండురంగస్వామి విగ్రహాన్ని ఆనాడు గోవింద్ నాయక్ ప్రభృతులు కనున్నట్లు తెలుస్తున్నది. యాపర్లలో రుక్మిణీదేవి అమ్మవారి విగ్రహం కూడా లభ్యమైంది. ఆయన ఆధ్వర్యంలోనే రెండు స్వయంభువు విగ్రహాలను వనపర్తికి శాస్త్రోక్తంగా తెచ్చి ప్రతిష్ఠించారు. గోవింద నాయక్‌కు స్వప్నంలో పాండురంగస్వామి సూచించిన విధంగానే వనపర్తి శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనలు జరిగినట్లు తెలుస్తున్నది.  ఆలయంలో దక్షిణం వైపున ఉత్తరాభిముఖంగా విగ్రహాలను నెలకొల్పారు. దక్షిణద్వారం గుండా దర్శించుకోనే ఏర్పాట్లు చేశారు.

ట్రస్టు ఆధ్వర్యంలో పూజలు

గోవింద నాయక్ మరణానంతరం వారి ఆడపడచు కుమారుడు గిరిరావు ఖాశికర్ ‘గోవింద నాయక్’ పేరుమీద ట్రస్టును ఏర్పాటు చేశారు. అప్పటినుంచీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉత్సవ సేవలు నిర్వహిస్తున్నారు. 1994లో  గిరిరావు అనంతరం వారి వంశస్థుల నిర్వహణలోనే కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే, ఈ ఆలయంలో ప్రతీ ఏడాది ధనుర్మాస ఉత్సవాలను మాత్రం అత్యంత ఘనంగా జరుపుతారు.

- పి.రాము

విజయక్రాంతి, వనపర్తి