calender_icon.png 25 December, 2024 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజ్‌పేయి జీవితం ఆదర్శం

25-12-2024 12:33:26 AM

  1. ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు
  2. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
  3. తాజ్‌డెక్కన్‌లో ఏబీవీ ఫౌండేషన్ స్మారకోపన్యాసం

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మాజీ ప్రధాని వాజ్‌పేయి జీవితం ఆదర్శనీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నేటి యువతరం, రేపటితరం ఆయన స్ఫూర్తితో ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో కిషన్‌రెడ్డి స్మారకోపన్యాసం చేశారు.

తాను విద్యార్థిగా ఉన్న సమయంలో వాజ్‌పేయి హైదరాబాద్ వచ్చినప్పుడు సహాయక్‌గా వ్యవహరించినట్టు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రధాని అయ్యేంతవరకు.. వాజ్‌పేయి నగరానికి వచ్చినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కేంతవరకు ఆయన వ్యవహారాలన్నీ చూసుకునే అవకాశం దొరికేదని తెలిపారు.

చిన్నచిన్న సభల నుంచి.. ఏపీ, తెలంగాణలో వాజ్‌పేయి అనేక ప్రాంతాల్లో పర్యటించారని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తాను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నట్టు నెమరువేసుకున్నారు. వాజ్‌పేయి ప్రసంగం వినేందుకు జనం ఎక్కడెక్కడినుంచో వచ్చేవారని, నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప నాయకుడు ఆయన అని స్మరించుకున్నారు. 

విలువలు వదులుకోలేక పదవినే త్యజించి..

పార్లమెంటులో విశ్వాస తీర్మానం సందర్భంగా ఒక్క ఓటు తక్కువగా ఉన్న సందర్భంలోనూ విలువలను వదులుకోక ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప మనిషిగా వాజ్‌పేయి చరిత్రలో నిలిచిపోయారని కిషన్‌రెడ్డి అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా కేసులో జైల్లో ఉన్నప్పుడు.. జనతాపార్టీలో విలీనం చేసేందుకు ఏమాత్రం ఆలోచించలేదని చెప్పారు.

ఆయన దృష్టిలో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, పర్సన్ లాస్ట్.. అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలన్న లక్ష్యంతో జనతాపార్టీలో జనసంఫ్‌ును విలీనం చేశారన్నారు. దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనంగా దానిని అభివర్ణించారు. వాజ్‌పేయి మాట్లాడుతుంటే.. అన్ని పార్టీల నాయకులు శ్రద్ధగా వినేవారని అన్నారు.

ఆయన కవితలను పుస్తకాల రూపంలో అందించడం మొదలుకుని కవి సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా యువతలో ఆసక్తిని రేకెత్తించాలని ఏబీవీ ఫౌండేషన్‌ను కోరారు. వాజ్‌పేయి తన జీవితాన్ని జాతీయవాద సిద్ధాంతానికి అంకితం చేశారని కొనియాడారు. 2025 డిసెంబర్ వరకు ఏడాదిపాటు వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పాల్గొన్నారు.