calender_icon.png 25 December, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలకు ప్రతిరూపం వాజ్‌పేయి

25-12-2024 02:12:19 AM

  1. గ్వాలియర్ నుంచి ఢిల్లీ పీఠం వరకు రాజకీయ ప్రస్థానం
  2. బీజేపీ ఎదుగుదలలో ముఖ్యభూమిక పోషించిన దార్శనికుడు
  3. అద్భుతమైన ప్రసంగాలకు పెట్టింది పేరు.. సాహితీ ప్రేమికుడిగాను విఖ్యాతి
  4. పోఖ్రాన్ అణుపరీక్షలతో అగ్రరాజ్యానికి సవాల్ విసిరిన ప్రధాని
  5. నేడు ఆయన జయంతి సందర్భంగా ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం

* వాజ్‌పేయి రాజనీతిజ్ఞుడే కాదు.. విలువలకు పట్టంగట్టిన నేత. ఉత్తమ పార్లమెంటేరియన్. ఆయన ప్రసంగం అద్భుతం. పాండిత్యం ఆమోఘం. ఆయన ప్రసంగంలో కవిత్వపు సువాసనలు తొణికిసలాడేవి. చమత్కారపు చమక్కులు గిలిగింతలు పెట్టేవి. ఛలోక్తుల చురకలు తారజువ్వల్లా పేలేవి. ఆయన వాగ్ధాటికి ఎంతటి వారైన మంత్రముగ్ధులవ్వాల్సిందే.

పోఖ్రాన్ అణుప్రయోగంతో భారత్‌ను పవర్‌ఫుల్ దేశంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అగ్రరాజ్యం అమెరికా కంటే మనం దేనిలోనూ తక్కువ కాదని నిరూపించిన నేత. నేడు ఆయన జయంతి, గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా ఆయన జీవన గమనం, రాజకీయ వైభవంపై ‘విజయక్రాంతి’ సింహావలోకనం.

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : అటల్ బిహారీ వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని షిండే కా బడా ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణ బాజ్‌పేయి. వాజ్‌పేయి తండ్రి ఉపాధ్యాయుడు. వాజ్‌పేయికి ముగ్గురు అన్నలు, ము గ్గురు సోదరీమణులు.

వాజ్‌పేయి బడా అనే గ్రామంలో 8వ తరగతి వరకు చదివారు. తర్వాత గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కాన్పూర్‌లోని డీఏవీ కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజులు జైలులో ఉన్నారు. 

బీజేపీని శిఖరాగ్రాన నిలిపిన నేత...

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విజయ శిఖరాలకు చేర్చడంలో వాజ్‌పేయి పాత్ర ఎంతోఉంది. 1980లో బీజేపీ ఏర్పడగా, ఆయనే పార్టీ తొలి అధ్యక్షుడు. 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఎన్నికలు జరుగగా, బీజేపీ కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు కూడా ఓడిపోయారు.

కానీ 1990వ దశకంలో వాజ్‌పేయి బీజేపీలో అతి ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగి ఉన్నారు. 1996లో కేంద్రంలో మొదటిసారిగా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు వాజ్ పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు. పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ రాకపోవడంతో నాడు వారి ప్రభు త్వం పడిపోయింది.

1998లో వాజ్‌పేయి తిరిగి ప్రధాని అయ్యారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడుసార్లు ఆయన ప్రధానిగా కొనసాగారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ  లాహోర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీస్ భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల్లోనే ఒక చారిత్రాత్మక మలుపు.

ఉత్తమ పార్లమెంటేరియన్..

1957లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ నుంచి జనసంఫ్‌ు టిక్కెట్‌పై ఎంపీగా గెలిచారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు. 1997లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా సేవలందించారు.

ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో వాజ్‌పేయి హిందీలో ప్రసంగించారు. అలా హిందీలో ప్రసంగించిన మొదటి భారత నేత వాజ్‌పేయి. అప్పటివరకూ ఈ ప్రపంచ వేదికపై ఎవరూ హిందీలో ప్రసంగం చేయలేదు. వాజ్‌పేయికి భారత ప్రభుత్వం 27 మార్చి 2015న దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఆయన 16 ఆగస్టు 2018న కన్నుమూశారు.

పదాలకు సుగంధం పూసినట్లుగా..

వాజ్‌పేయి ప్రసంగం మత్తగజం నడకలా ఉండేది. పదాలకు సుగంధాలు అద్దినట్లుండేది. సభికులు ఎంతటి వారైనా ఆయన ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యేవారు. ప్రత్యేకంగా ఆయన హాస్యచతురత  అమితంగా ఆకట్టుకునేది. తన ప్రసంగాల్లో ఎప్పటికప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థి తులు, సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా ఉద్బోధించేవారు.

అందుకే ఆయన్ను అజాత శత్రువని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా కొనియాడేవారు. తొలి ప్రధాని నెహ్రూ అప్పట్లోనే ‘వాజ్‌పేయీ నువ్వు ఎప్పటికైనా ఈ దేశ ప్రధాని అవుతావు !’ అని చెప్పేవారట. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత నెహ్రూ అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

వాజ్‌పేయి దేశ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పీవీ నరసింహారావు కొనసాగిన కాలంలోనూ నాటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయిని ప్రభుత్వ దూతగా ఐక్యరాజ్యసమితికి పంపించారంటే ఆయనపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

విపత్కర పరిస్థితుల్లోనూ స్థితప్రజ్ఞత.. 

పార్లమెంట్‌పై ఉగ్రమూకలు దాడికి పాల్పడిన సమయంలో ఓ ఉన్నతాధికారి వాజ్‌పేయి వద్దకు వచ్చాడు. దాడి గురిం చి సవివరంగా వివరించాడు. టీవీల్లో ప్రసారమవుతున్న వార్తలను చూపించాడు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని వాజ్‌పేయికి సూచించారు. వెంటనే వాజ్‌పేయి సమాధా నమిస్తూ..

‘ఇప్పుడు యంత్రాంగమంతా పార్లమెంట్ వద్ద పరిస్థితులను అదుపులోకి తెచ్చే పనిలో ఉంది. ఇప్పుడు మనం అత్యవసర సమావేశం నిర్వహిస్తే, నాకేం సమాధానాలు చెప్పాలనే ధ్యాసలో యంత్రాంగం పడిపోతుంది. ముందు వారిని పనిచేయనీయండి. తర్వాత వారి నుంచి ఫైనల్ నివేదిక తీసుకుందాం’ అని సమాధానమిచ్చారు. ఇది వాజ్‌పేయి స్థితప్రజ్ఞకు ఒక నిదర్శనం.

విదేశీ నిఘా సంస్థలకు సైతం చిక్కకుండా అణుపరీక్షలు.. 

దేశంలో ఎలాంటి గంభీరమైన పరిస్థితులు నెలకొన్నటికీ తన సున్నితమైన మాటలతో పరిస్థితులను చక్కదిద్దడం వాజ్‌పేయికి వెన్నెతో పెట్టిన విద్య. 1974తో పోలిస్తే, 1998 తర్వాత జరిగిన పోఖ్రాన్ అణుపరీక్షలు చాలా భిన్నమైనవి. 1974లోనే భారత్ అణుపరీక్షలు ప్రారంభిస్తున్నదని తెలుసుకున్న అమెరికా నాడు మనదేశంపై తీవ్రమైన విమర్శలు చేసింది.

రెండోసారి జరిగిన అణుపరీక్షల జాడ అమెరికా నిఘా సంస్థలు, రష్యా నిఘా సంస్థలకు కూడా తెలియలేదంటే ఎంత పక్కాగా పరీక్షలు జరిగాయో అంచనా వేయవచ్చు. ‘మేం శాంతియుత అవసరాలకు అణుపరీక్షలు నిర్వహించాం. ఇప్పుడు మాది అణ్వస్త్ర దేశమని ఘనంగా ప్రకటించుకున్నాం’ అంటూ భారత ప్రధానిగా ప్రపంచ దేశాలకు చాటిచెప్పారు.

అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వచ్చినప్పుడు.. 

1998 మే నెలలో పోఖ్రాన్ పరీక్షలు జరిగాయి. 2000 మార్చి నాటికి.. అంటే ఈ 22 నెలల్లో వచ్చిన మార్పు ఏంటంటే.. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఐ దు రోజులు భారత్‌లో పర్యటించారు. ఇం తటి విపత్కర పరిస్థితుల్లోనూ దేశాన్ని ముందుకు నడపాలో వాజ్‌పేయికి బాగా తెలుసు అని చెప్పేందుకు బిల్‌క్లింటన్ ప ర్యటన మంచి ఉదాహరణగా చెప్పొ చ్చు.

అంతకుముందు వరకు భారత పర్యటన కు ఒక అమెరికా అధ్యక్షుడు వస్తే, వెనువెంటనే ఆయన పాకిస్తాన్‌లోనూ పర్యటిం చేవారు. కానీ బిల్‌క్లింటన్ మాత్రం పాకిస్తాన్‌లో కనీసం 5 గంటలైనా ఉండలేక పోయారు. అణుపరీక్షల నేపథ్యంలో అమెరికా, జపాన్ ఆంక్షలు విధిస్తే వాజ్‌పేయి ఏమాత్రం ఆలోచించలేదు. ‘యూరోపియ న్ కంపెనీలు, వియత్నానికి చెందిన కంపెనీలను కూడా భారత్‌కు ఆహ్వానిస్తాం’ అని వాజ్‌పేయి బలమైన సంకేతాలు ఇచ్చారు.