గీతానాం షష్ఠమాధ్యాయం జపామి ప్రత్యహం నృపః
తేనైవ తేజు రాశిర్మె సురాణామపి దుస్సహః
పూర్వం గోదావరి నదీ తీరంలో ‘ప్రతిష్టానం’ అనే నగరం ఉండేది. దానిని ధర్మాత్ముడైన ‘జానశ్రు’ అనే రాజు పాలించేవాడు. ఆయన ధర్మనిరతికి, ప్రజాహిత కార్యక్రమాలకు మెచ్చిన దేవతలు హంసల రూపం దాల్చి, ఆకాశ మార్గంలో అతని ప్రాసాదానికి వచ్చేవారు. ఒకరోజు ఆ రాజు డాబాపై విశ్రాంతి తీసుకొనే వేళ ఆకాశమార్గాన విహరిస్తున్న హంసల గుంపును చూశాడు. వాటిలోని ‘భద్రా శ్యుడు’ తదితర హంసలు మిగిలిన హంసలకన్నా వేగంగా ముందుకు పరిగెత్తసాగాయి. అప్పుడు ఆ గుంపులోని ఒక వృద్ధ హంస అన్నదిలా.
“ఓ కుర్ర హంసలారా! ధర్మాత్ముడైన రాజు సమక్షంలో దూకుడుతనం పనికిరాదు.” దానికి ఆ హంసలు, “బ్రహ్మవేత్త అయిన రైక్యుని ముందు ఈ రాజు తేజం ఏపాటి?” అన్నాయి. ఇది విన్న రాజు ఆశ్చర్యానికి లోనయ్యాడు.“ఎవరీ రైక్యుడు? అతనిని వెతకండి” అని చారులను పంపించాడు. వారు ఆయా పుణ్యక్షేత్రాలన్నీ గాలించి, తుట్టతుదకు కాశ్మీర దేశంలో మాణిక్యేశ్వరాలయ ద్వారం వద్ద ఒక బండిలో కూర్చున్న రైక్యుని కనుగొన్నారు. చారులు ఆయన వద్దకు వెళ్లి ప్రణమిల్లి, “మహాత్మా! తాము ఇక్కడ, ఇలా ఉండటానికి కారణమేమిటి?” అని అడిగారు. దానికి అతను, “నేను పూర్ణ మనోరథుణ్ణి” అన్నాడు. వాళ్లు ఈ మాటలను రాజుకు విన్నవించారు. వెంటనే రాజు ఆ ముని వద్దకు బయల్దేరాడు. బహుమతిగా ఇవ్వడానికి వేయి గోవులు, పట్టువస్త్రాలను, ముత్యాల హారాలను వెంట తీసుకెళ్లాడు. రైక్య మునీంద్రునికి తాను తెచ్చిన కానుకలను స్వీకరింపవలసిందిగా ప్రార్థించాడు రాజు. మునీంద్రుడుొ
“రాజా! నా సంగతి నీకు తెలియదా? ఈ కానుకలు నాకెందుకు, వద్దు వద్దు!!” అన్నాడు. అప్పుడు రాజు ఆ ముని పాదాలు పట్టుకుని ‘క్షమించమని’ వేడుకొన్నాడు. తన ‘మహత్తుకు కారణమేమిటని’ సెలవియ్యమని అడిగాడు. రైక్య మునిx “నేను భగవద్గీత ఆరవ అధ్యాయాన్ని ప్రతిరోజూ పారాయ ణం చేస్తున్నాను. దాని ప్రభావం వల్లే నాకింతటి వైరాగ్యం సిద్ధించింది” అన్నాడు. దాంతో, ఆ రాజు రైక్య మునికి చాలాకాలం వరకు సేవ చేసి నగరానికి వచ్చాడు. ఆయన నుండి పొందిన ‘భగవద్గీత’ ఆరవ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేసి చివరకు ముక్తిధామం చేరాడు.
కలకుంట్ల జగదయ్య