calender_icon.png 26 October, 2024 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యో నారాయణో హరిః

01-07-2024 12:00:00 AM

‘వైద్యో నారాయణో హరీ’ వైద్యులు దేవుళ్లతో సమానమని, తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఆపదలో వైద్యులే పునర్జన్మ ప్రసాదిస్తారనే నానుడిని మూడు తరాలుగా  నిజం చేస్తోంది ఆ వైద్య కుటుంబం. మహిమాన్విత యాదగిరి కొండపై కొలువైన నారసింహుడు భక్తులకు ఆపదలు తీరుస్తుండగా.. శారీరక వ్యాధుల బారిన పడి కొండకింద తమ ఆసుపత్రిని ఆశ్రయించిన రోగులకు లాభాపేక్ష లేకుండా సముచిత వైద్యసేవల పరంపర కొనసాగిస్తూ తమ సేవానిరతిని కొనసాగిస్తున్నారు. 

ఆపదలో వైద్యం కోసం తమ వద్దకు వచ్చే రోగుల వద్ద ఫీజు ఉందా.. లేదా అనే అంశాలను పట్టించుకోకుండా వైద్యం అందించడమే లక్ష్యంగా దశాబ్దాలుగా యాదగిరిగుట్ట పట్టణంలో సేవలు అందిస్తున్న కుటుంబాన్ని ఈ ప్రాంత పేదప్రజలు వేనోళ్ల కొనియాడబడుతున్న ముడుంబై కుటుంబం. ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో తిరుమలమ్మ  గారి హస్పటల్ పేరిట పిలుచుకునే తిరుమల నర్సింగ్ హోమ్‌లో నామమాత్రపు ఫీజులతో వైద్య సేవ లు అందుతుంటాయి. యాదగిరిగుట్ట పట్టణం కుగ్రామంగా ఉన్నప్పడే  ఈ ఆసుపత్రిని నిజాం కాలంలోనే  దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితమే  ముడుంబై(దేవక) తిరుమలమ్మ ప్రారంభించారు.

ఆమె నిజాం ప్రభుత్వంలో వైద్యరాణి, మిడ్ ఫైరీ వైద్యకోర్సులు చేసి, మెడికల్ ప్రాక్టిషనర్‌గా  ప్రభుత్వ సర్వీసులో కొనసాగారు. ఆ తర్వాత యాదగిరిగుట్టలో తమ సేవలను ప్రారంభించారు. తమను ఆశ్రయించిన రోగులకు నయం చేయడమే ధ్యేయంగాపెట్టుకున్న ఆమె తన కుమారుడు ముడుంబై నర్సింహాచార్యులను సైతం వైద్య వృత్తిలోకి ప్రవేశపెట్టారు. తన చివరి శ్వాస వరకు వైద్య సేవలు అందిస్తూనే 1990లో పరమపదించారు.  ఉస్మానియాలో బీఏఎంఎస్ వైద్య పట్టా పొందిన ఆయన తల్లి అడుగుజాడల్లోనే 1974లో వైద్య వృత్తిలోకి ప్రవేశించారు. తల్లికి తగ్గ తనయుడిగా తన వైద్య సేవా నైపుణ్యతతో  డాక్టర్ సింహయ్యగా  యాదగిరిగుట్ట పరిసర ప్రజలకు ఆప్తుడిగా మారాడు.

ఇప్పటికి వైద్య సేవలుఉ అందించే డాక్టర్ నర్సింహాచార్య తనను ఆశ్రయించిన రోగులకు ఫీజులతో ప్రమేయం లేకుండా వైద్యం అందించే ఆయన తర్వాత తరం  తన కుమారుడు డాక్టర్ గిరిధర్ సైతం పేదలకు అందుబాటులో ఉంటూ ఆధునిక వైద్యం అందిస్తున్నారు. ఎండీ, పీజీడిహెచ్‌ఎస్ కోర్సులు పూర్తి చేసి ఫిజిషియన్‌గా గుర్తింపు పొందారు. తన తండ్రి సేవనారతికి నిజమైన వారసుడుగా తిరుమల నర్సింగ్‌హోమ్‌లోనే 2002 నుంచి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీంతో దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా పేదలకు వైద్యం అందించే మూడు తరాల వైద్యలుగా యాదగిరిగుట్ట ప్రాంతంలో అందరి మన్ననలు చూరగొంటున్నారు.

 యాదాద్రి భువనగిరి, విజయక్రాంతి