13 ఏళ్లకే కోట్లు పలికిన బీహార్ కుర్రాడు
- 1.10 కోట్లకు రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ
- అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
- అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌కు ఊహించని ధర
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిర్వహించిన ఐపీఎల్ మెగావేలం ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.639.15 కోట్లు ఖర్చు చేసి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా.. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈసారి వేలంలో కొందరి ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలిన సంగతి తెలిసిందే.
జాక్‌పాట్ లభించిన ఆటగాళ్లలో బిహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కచ్చితంగా చేర్చాల్సిందే. 13 ఏళ్లకే వేలంలోకి వచ్చిన వైభవ్‌ను రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది.
ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
2011లో బీహార్‌లోని సమస్తిపూర్‌లో జన్మించిన వైభవ్ సూర్యవంశీ 9 ఏళ్లకే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. 12 ఏళ్లకు ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగానూ నిలిచాడు. గతంలో యువరాజ్ సింగ్ (15 ఏళ్ల 57 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు చేసిన వైభవ్ రికార్డులకెక్కాడు.
గత నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్ జరిగిన యూత్ టెస్టు మ్యాచ్‌లో 62 బంతుల్లోనే 104 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే 13 ఏళ్ల వైభవ్ ఐపీఎల్‌లో ఆడేందుకు అర్హుడేనా అన్న ప్రశ్నలు మొలకెత్తాయి. అయితే ఐపీఎల్‌లో అధికారికంగా వయసు నిబంధన లేదు.
ఆటగాళ్లను ఆడించాలా వద్దా అన్నది ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. 2025 ఐపీఎల్ సమయానికి తుది జట్టులో అతడికి చోటు దక్కడం కష్టమైనప్పటికీ దిగ్గజాలు ద్రవిడ్, సంగక్కరతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అతడి కెరీర్‌కు ఉపయోగపడనుంది.
అన్‌క్యాప్‌డ్ అదరహో
వైభవ్‌తో పాటు అఫ్గానిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ కోసం ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్లు ఖర్చు చేసింది. వీరితో పాటు భారత్‌కు చెందిన పలు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు వేలంలో మంచి ధర పలికింది. రసిక్ సలామ్ దర్ (6 కోట్లు, ఆర్సీబీ), నమన్ దిర్ (5.25 కోట్లు, ముంబై), నెహాల్ వదేరా (4.2 కో ట్లు, పంజాబ్), అబ్దుల్ సమద్ (4.2 కోట్లు, లక్నో) ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ప్రియాన్ష్ ఆర్య (3.80 కోట్లు), అభినవ్ మనోహర్ (3.2 కోట్లు), అంగ్‌క్రిష్ రఘువంశీ (3 కోట్లు) మంచి ధర పలికారు.