రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న వాహన్ సారథి పోర్టల్ తెలంగాణలోనూ ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్న విధానాలను వివరించారు. గతేడాది సెప్టెంబర్ 30న జీవో తీసుకొచ్చి వాహన్ సారథిని అమలు చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. సారథి డేటా పోర్టింగ్‌తో పాటు డ్రైవర్ లొకేషన్‌లో సారథిని ప్రారంభించిన తర్వాత వాహనం డేటా పోర్టింగ్‌ను ప్రారంభించాలని ఎన్‌ఐసీని కోరినట్లు చెప్పారు. ఆ తర్వాత ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్ల పనితీరును పొన్నం పరిశీలించారు. మంత్రి వెంట రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ రమేశ్, ఇతర అధికారులు ఉన్నారు.