21-03-2025 01:09:04 AM
భారతీయ వడ్డెర (ఓడీఈ) సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డా.వెంకటేష్ మౌర్య
ముషీరాబాద్, మార్చి 20: (విజయ క్రాంతి): అన్ని రంగాలలో వెనుకబడిన వడ్డెర జాతి కులస్తులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో చేర్చాలని, వీరి అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేకంగా వడ్డెర కార్పోరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని భారతీయ వడ్డెర(ఒడిఇ) సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డా.వెంకటేష్ మౌర్య, రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపడానికి సిద్ధమైంద న్నారు. ఆదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ లో తీర్మా నం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేధికను పంపాలని కోరారు.
ఏపీ ప్రభుత్వం వడ్డెరుల కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిం దన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఎన్నికలకు ముందు ఏఐసీసీ నేత రాహుల్ గాం ధీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
యేడాదిన్నర గడిచినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసి ప్రతి యేడాది జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలన్నారు.
వడ్డెరులను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అదుకోవాలని కోరారు. రాష్ట్రంలో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించాలని, నామినేటేడ్ వదవుల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు సంపంగి ప్రభాకర్, డేరింగుల రూపమహేశ్వరి, కొమ్మరాజుల శేఖర్, బత్తిని రాము, దండుగుల రమేష్, డేరంగుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.