calender_icon.png 5 January, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి..

02-01-2025 10:39:07 PM

వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): సంచార శ్రమ జీవులైన వడ్డెరలను దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా, ఎస్టీలుగా పరిగణిస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వడ్డెర జాతిని గిరిజన తెగల (ఎస్టీ)లో చేర్చాలని, వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారత వడ్డెర, వోడ్, బోవి, బేల్దార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వడ్డెరల రాష్ట్ర సదస్సు గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో జరిగింది. సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఎంబిసి చైర్మన్ జెరిపాటి జైపాల్, అఖిల భారత వడ్డెర, వోడ్, బోవి, బేల్దార్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షరాలు వేముల తిరుమల దేవి, ప్రధాన కార్యదర్శి గుంజ రేణుక, యువజన విభాగం జాతీయ అధ్యక్షులు మంజల రమేష్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మంచపు రమ తదితరులు ప్రసంగించారు. ఎంబిసి చైర్మన్ జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలలో వడ్డెర్లకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం వడ్డెరలంతా ఐక్యతతో పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

వడ్డెరలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా, ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్న మాదిరిగా బీమా, రాయితీలు తదితర సదుపాయాలు కల్పించే విషయాలను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా వడ్డెర జాతికి అన్యాయం జరుగుతున్నదని, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టర్ల  కోసం కో- ఆపరేటివ్ సోసైటీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్ ప్రస్తుతం 3 శాతానికి (వడ్డెరలు, సగరలు కలిపి) కుదించారని, దానిని యధావిధిగా 15 శాతానికి పెంచాలని కోరారు. వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వడ్డెర్లు, ఎరుకుల, యానాది, లంబాడీలు, డి.ఎన్.టి సంచార జాబితాలో ఉన్నారని,  1970లో అనంతరం ఏర్పడిన కమిషన్ ఎరుకుల, యానాది, లంబాడీలను, ఎస్.టి (గిరిజన తెగలు) లో చేర్చి, లిపి లేని కారణంగా వడ్డెరులను బిసి ఎ లో చేర్చి వడ్డెర్లకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఫలితంగా వడ్డెర్లు సామాజికంగా, ఆర్థికంగా, ఉన్నత విద్య, రాజకీయ రంగాలలో వెనుకబడ్డారన్నారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉండడంతో వడ్డెర్లు అభివృద్ధి చెందుతున్నారని, మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల జనాభా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు తీరని చేశారన్నారు. అలాగే కాంట్రాక్టులలో సొసైటీలకు సాల్వెన్సి లేకుండా క్లాస్2 వరకు రిజిస్ట్రేషన్స్ చేయాలని, ఇఎండి లేకుండా ప్రభుత్వరంగ సంస్థలలో 25 శాతం రిజర్వేషన్ పనులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 ఏళ్లు నిండిన వడ్డెరలకు నెలకు రూ.4 వేల ఫించన్ ఇవ్వాలని, మైనింగ్ లో వడ్డెర కో-ఆపరేటివ్ సోసైటీలకు 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. మైనింగ్ క్వారీలపై విచారణ జరిపి వారి లైసెన్స్ రద్దు చేసి వడ్డెరలకు రావలసిన వాటాను వెంటనే ఇప్పించాలని ఆయన కోరారు. సదస్సులో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంజల హనుమయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు సాతల గోపాల్, ప్రధాన కార్యదర్శి ఇడగోటి నగేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఇడగోటి పార్వతి, యువజన అధ్యక్షులు బొంత చిరంజీవి, యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బోదాసు శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు రేపన్ గిరిబాబు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.