క్యాన్సర్
గర్భాశయ క్యాన్సర్.. ఈ పేరు వినగానే భయందోళనకు గురవుతారు.. ఇదొక ప్రాణాంతక వ్యాధిగా.. వ్యాధి వస్తే బతికే ఛాన్సే లేనట్లుగా భయపడిపోతుంటారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం చాలా ఈజీ అంటున్నారు నిపుణులు. క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయి. ప్రారంభ దశలో గుర్తించలేకపోవడంతో ప్రతి సంవత్సరం ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఒకటి సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్). దీనికి టీకాలు, పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లోపంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే 9-14 ఏళ్లలోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారినపడకుండా కేంద్రం దృష్టి పెట్టాలని రాజ్యసభ సభ్యురాలు ఎంపీ సుధా మూర్తి తన ప్రసంగంలో వివరించారు. ఇంతకీ ఏంటీ ఈ క్యాన్సర్? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్‌మెంట్ ఎలా తీసుకోవాలి? అనే విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
మన దేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ది నాలుగో స్థానం. భారత్‌లో ప్రతి సంవత్సరం 1,22,844 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌కు గురవుతుండగా.. 67,477 మంది ఆ వ్యాధితో మరణిస్తున్నారు. దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్లు (99.7 శాతం) అధిక ప్రమాదకర రకమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హై రిస్క్ హెచ్‌పీవీ) సంక్రమణ వల్లే వస్తాయని పరిశోధనల్లో తేలింది.
ఎలా సోకుతుంది?
హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుంది. కానీ రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారంపర్యంగా, ధూమపానం.. ఇలా తదితర కారణాలతో ఇది సంక్రమించే అవకాశముంది.
హెచ్‌పీవీ వైరస్ అంటే?
కొన్ని వైరస్‌లు సముదాయాన్ని హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వైరస్ అంటారు. వీటిలో దాదాపు 100 రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కాగా, మరికొన్ని అంత ప్రమాదకరం కాదు. హెచ్‌పీవీ అనేది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఎలాంటి లక్షణాలను కలిగి వుండవు. చాలామందికి తమకు హెచ్‌పీవీ సోకినట్లు తెలీదు. ఈ వైరస్ ఎలాంటి హాని కలిగించకుండా శరీరంలో 15 ఏళ్లు ఉంటుంది. ఎక్కువ మంది మహిళల్లో ఈ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు వాటంతటవే నయం అవుతాయి. హెచ్‌పీవీ 16. 18 ప్రమాదకరమైనవి. ఈ వైరస్‌లు జననాంగాల క్యాన్సర్, ఆసన క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్లు వచ్చేలా చేస్తాయి. ప్రమాదకరం కాని వైరస్‌ల వల్ల పులిపిరులు లాంటి చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.
ఈ క్యాన్సర్ రెండో స్థానంలో..
మనదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్‌లో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. 2018లో ఐదు లక్షలకు పైగా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో మూడు లక్షల మంది చనిపోయారు. ఈ క్యాన్సర్ ఎక్కువగా తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో వస్తోంది. గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా హెచ్‌పీవీ 16, 18 వల్ల వస్తుంది. చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు ఉండటం, చిన్న వయసులో గర్భం దాల్చడం, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, పేదరికం, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పోషకాహార లోపం లాంటివి దీనికి కారణాలుగా చెప్పవొచ్చు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ధూమపానం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, క్లమిడియా లాంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు లాంటి ఇతర అంశాలు కూడా దీనికి కారణం కావొచ్చు.
వ్యాక్సిన్‌తో రక్షణ..
హెచ్‌పీవీ సంక్రమించకుండా టీకా కనీసం పదేళ్లు రక్షిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఈ రక్షణ ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా?
సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉండవు. ఇంజెక్షన్ చేసిన చోట కొద్దిగా ఎర్రబడటం, తలనొప్పి, టెంపరేచర్ పెరగడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. టీనేజర్లు భయానికి గురవడం వల్ల కొన్నిసార్లు స్పృహ తప్పే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.
క్యాన్సర్ నివారణ..
- 9-14 ఏళ్ల వయసులో వ్యాక్సిన్ తీసుకోవడం.
- స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి.
- తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించడం ద్వారా 90 శాతం వరకు దీనిని విజయవంతంగా నిర్మూలించవచ్చు.
- హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో రెండు డోసులుగా ఇస్తారు. లైంగిక సంబంధాలు ఏర్పడక ముందే ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం.
- అమ్మాయిలకు 9-14 ఏళ్ల వయసులోపే మొదటి డోస్ వేయించాలి. రెండో డోస్ 6-12 నెలల వ్యవధి తర్వాత వేయించాలి.
- వ్యాక్సిన్ మొదటి డోస్ 15 ఏళ్ల వరకు వేయించుకోనట్లయితే తప్పని సరిగా మూడు డోస్‌లు వేయించుకోవాలి.
- స్వలింగ సంపర్కులు, వ్యాక్సిన్‌కు అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు మూడు టీకాల మోతాదు అవసరం.
వ్యాధి లక్షణాలు
- ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
- లైంగిక చర్యలో పాల్గొన తర్వాత లేదా మెనోపాజ్ దశలోనూ బ్లీడింగ్ అవుతుంది.
- దుర్వాసనతో కూడిన వ్జునల్ డిశ్చార్జి.. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత వ్జునా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది.
- పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించవచ్చు.
రూప
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా..
రెండు పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.
పాప్ స్మియర్: ఈ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కణాల శాంపిల్ సేకరిస్తారు. ఇది క్లినిక్‌లో రెండు మూడు నిమిషాల్లో జరిగే తేలిక పాటి పరీక్ష. నొప్పి కలిగించని పరీక్ష కాబట్టి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి మహిళా 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకూ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు.
హెచ్‌పీవీ పరీక్ష: దీన్ని ప్రతి ఐదేళ్లకొకసారి చేయించుకోవాలి. క్యాన్సర్ కన్నా ముందు స్థితిని కార్సినోమా ఇన్ సైటూ అంటారు. ఆ దశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్‌ను 90 శాతం విజయవంతంగా నిర్మూలించవచ్చు. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ని తొలిదశలో గుర్తించడమే కాదు, క్యాన్సర్ రాబోయే ముందు మార్పులను పసి గట్టడం కూడా సాధ్యమవుతుంది. వెంటనే చికిత్స చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.
డాక్టర్ రవిచందర్ వెలిగేటి - చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.
వ్యాక్సిన్ తీసుకోవాలి!
సర్వైకల్ క్యాన్సర్‌కు రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది వైరల్ ఇన్ఫెక్షన్. అది పాపిలోమా వైరస్ మూలంగా 90 శాతం క్యాన్సర్ దాని ద్వారానే వస్తుందని 60 ఏళ్ల పరిశోధనల్లో కనిపెట్టారు. 300 వందల రకాల హెచ్‌పీవీ వైరస్‌లు ఉన్నాయి. దాంట్లో ఒక 60 రకాలను మాత్రమే క్యాన్సర్ కణాలుగా గుర్తించారు. అలాగే నాలుగు హెచ్‌పీవీ రకాలకు మాత్రమే మనం వ్యాక్సిన్ తయారు చేయగలిగాం. వ్యాక్సిన్ తీసుకుంటే 100 శాతం తగ్గుతుందంటే చెప్పలేం. డిఫ్తీరియా, చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ రాకుండా లేదు కదా. వ్యాక్సిన్ తీసుకుంటే 60 శాతం క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుం ది. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయి ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. మొత్తంగా వ్యాక్సిన్ తీసుకోవడం అన్నది చాలా ముఖ్యం. వేరే దేశాల్లో ఎప్పటి నుంచో వ్యాక్సిన్ అందిస్తున్నారు. అలా ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తే బాగుంటుంది. 9 ఏళ్ల వయసు అమ్మాయిలే ఎందుకు తీసుకోవాలంటే మెచ్యురూ అయినా.. కాకపోయినా.. సెక్స్‌వల్ కాంటాక్ట్ ఏర్పడక ముందు వ్యాక్సిన్ ఇవ్వాలి. హెచ్‌పీవీ వైరస్ అన్నది సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ వయసులో ఇచ్చేస్తే ప్రొటెక్షన్ ఉంటుంది.
-- లక్ష్మి, - కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రిస్క్ ఆబ్‌స్టెట్రీషియన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్
ట్రీట్‌మెంట్ కంటే..
గర్భాశయ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9-26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 9-14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ ప్రోత్సహించాలని ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికల గర్భాశయ క్యాన్సర్లను నిరోధించేందుకు ప్రభు త్వం.. టీకా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వ్యాక్సిన్ మార్కెట్‌లో రూ.1400లకు లభిస్తుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే.. ఇది రూ.800లకు లభించొచ్చు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కంటే నివారణ ముఖ్యం. అందుకే దీన్ని మేం ప్రమోట్ చేస్తున్నాం అని సుధామూర్తి మహిళల ఆరోగ్యంపై ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సక్సెస్ ఫుల్‌గా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని” ఎంపీ సుధా మూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఎంపీ సుధా మూర్తి