రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగాయి. అయితే, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి యూటర్న్ దెబ్బతో ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ సర్కారుపై అలిగిన గద్వాల ఎమ్మెల్యే.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌తో భేటీ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాను కాంగ్రెస్ కండువా వేసుకోలేదని దేవాలయానికి సంబంధించిన కండువా వేసుకున్నానని ఆ సందర్భంలో చెప్పి కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు పంపారు.
ఈ ఘటన అధికార పార్టీ నేతలకు సంకటస్థితిని కలిగించింది. మంత్రి జూపల్లి రాయబారంతో కృష్ణమోహన్‌రెడ్డి మెత్తబడి మళ్లీ సీఎంతో భేటీ అయ్యారు. ఇప్పుడాయన బీఆర్‌ఎస్ నేతలకు దూరంగా ఉంటున్నారు. అయితే గద్వాల ఎమ్మెల్యే అటుఇటూ ఘటన తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు కనిపించడంలేదు. వాస్తవంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించలేదని, అందుకే కృష్ణమోహన్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఆకర్ష్ వ్యూహం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.