calender_icon.png 5 February, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నంలో ప్రయోజకత్వం

01-02-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

“మా పత్రికలో దివాకర్ల వారు, సినారె వంటి పెద్దలెవ్వరు రాసినా వారికి కూడా 10 రూపాయలే ఇస్తాం. నీకు కూడా అంతే ఇచ్చాం” అన్నారాయన. కవిని కావాలన్న పట్టుదల నాకు అప్పుడే పెరిగింది.

మాది ఎంత పేద కుటుంబం అంటే ‘కాలు, చెయ్యి ఆడితే గాని ఇల్లు గడవని’ స్థితి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత అప్పటికి మా ఇంట్లో ఉన్నవాళ్ల సంఖ్య పద్దెనిమిది. అమ్మానాన్నలు, ఇద్దరన్నలూ వదినలూ, వారి పిల్లలతో మొత్తం ఇల్లు సందడిగా ఉండేది.

వ్యవసాయంలోలాగా చేనేత కుటుంబంలో ఇంటిల్లిపాదీ పనిచేయాలి. ఐతే, అందరికంటే మా అమ్మ ఎక్కువగా పని చేసేది. ‘ఆసు వోయడం కానించి, దారపు కండెలు చుట్టి ఇవ్వడం వరకు’ అన్ని పనులూ అమ్మే చూసేది. ఎంత నేసినా వస్త్రానికి గిట్టుబాటు ధర లభించని కాలమిది.

నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. ప్రతి సంవత్సరం అన్నయ్యలిద్దరూ నాన్నతో కలిసి ఊరి షావుకారు తిరుపతయ్య దగ్గరకు వెళ్లి 600 రూ॥లు అప్పు తెచ్చేవారు. ఆయన అడిగిన ధరకు చీరెలు నేసి ఇవ్వాలి. అట్లా అప్పు తీర్చడం! ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నన్ను మా పెద్దన్న హైదరాబాద్‌లో చదివించాలని తాపత్రయపడ్డాడు.

అదంత సామాన్య విషయం కాదని త్వరలోనే అర్థమైంది. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వారి విశారదలో ఉత్తీర్ణుడనైన నన్ను మా అన్నయ్య స్వయంగా హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి, పరిషత్తు వారి ప్రాచ్య కళాశాలలో చేర్పించారు. “మా తమ్ముణ్ణి పట్నంలో చదివించడానికి తీసుకొని వచ్చాను గాని ఇక్కడ వాడు తన కాళ్లమీద తాను నిలబడి చదువుకోవలసిందే..”

అని కళాశాలలో చేరిన రోజే పరిషత్తు కార్యాలయ ఉద్యోగితో చెప్పడం విన్నాను. ఆ మాటలకు నేను గాభరా పడలేదు. దేవునిపై భారం వేశాను. ఆ రోజెలాగో గడిచింది. ఆశ్చర్యంగా నారాయణగూడలో గుడిసెల్లో ఉండి చదువుకోవలసిన నాకు తిలక్‌రోడ్డులోని విశ్వకర్మ వసతి గృహంలో ఉండే అవకాశం లభించింది. గదిలో ముగ్గురం ఉండేవాళ్లం. తలా 3 రూపాయల అద్దె ఇచ్చేవాళ్లం. స్వయంపాకం తృప్తినిచ్చేది. 

ఇంటి పరిస్థితులు తెలిసినవాణ్ణి కనుక నా కుటుంబం మీద ఆధార పడకుండా ఏదైనా పనిచేసి సంపాదించాలని అనుకున్నాను. ఒక ట్యూషన్ సంపాదించుకు న్నాను. కొన్ని రోజులకు మునిమాణిక్యం నరసింహారావు దగ్గర లేఖకోద్యోగం లభించగా, అక్కడ వచ్చే పదిహేను రూపాయలు నా నెల గ్రాసానికి సరిపోయేవి. పద్మశాలి హాస్టల్‌లో ఉండాలనుకున్నాను కాని, వారు నెలకు 60 రూ॥లు రుసుము చెల్లించాలన్నారు.

అంత స్థోమత లేదు కనుక అందులో ప్రవేశించలేకపోయాను.  అదే సమయంలో ‘ఆప్కో ఫ్యాబ్రిక్స్’ వారు 10వ తరగతి పాసైన వారికి ఉద్యోగార్హత కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. నేను ఇంటర్వ్యూకి వెళ్లాను. “నెలకు 80 రూపాయల జీతంపై మంగళగిరిలో పని చేస్తావా?” అని అడిగారు. నా చదువుకు భంగం వాటిల్లుతుందని ఆ పని మానుకున్నాను. 

తొలి కవితకు పది రూపాయల పారితోషికం

అదే సమయంలో ‘నేత’ పత్రిక ఎడిటర్ పి.వి.రామనర్సయ్య గారితో పరిచయం ఏర్పడింది. వారే మొదటిసారి నా కవితను తమ పత్రికలో ప్రచురించి, పారితోషికంగా 10 రూపాయలు ఇచ్చారు. ఆ రోజు నేను పొందిన ఆనందం అనిర్వచనీయమైంది. 

“మా పత్రికలో దివాకర్ల వారు, సినారె వంటి పెద్దలెవ్వరు రాసినా వారికి కూడా 10 రూపాయలే ఇస్తాం. నీకు కూడా అంతే ఇచ్చాం” అన్నారాయన. కవిని కావాలన్న పట్టుదల నాకు అప్పుడే పెరిగింది. ‘ఎక్కడైనా పనిచేస్తే బాగుంటుందని’ మా అన్నయ్య నన్ను ఒక దర్జీ షాపుకు తీసుకొని వచ్చాడు. అది ముషీరాబాద్‌లోని బాలాజీ టాకీసువద్ద ఉంది.

ఆ యజమాని నాకు పరీక్షగా ‘ఒక జాకెట్టు కుట్టమని’ ఇచ్చాడు. కొంత తెలిసీ తెలియని దర్జీ పనితనం. అయినా, సాహసించి ఆ పనికి పూనుకున్నాను. కాని, అనుకోకుండా నా చేతుల్లోనే ఆ జాకెట్టు రెండు ముక్కలైంది. భయపడ్డాను. మళ్లీ ఎప్పుడూ పట్నంలో దర్జీ పని చేయలేదు. మా అన్న పట్టు విడువక, నన్నొక మెడికల్ షాపులో పనికి కుదిరించాడు.

అది నారాయణగూడలోనే ఉంది. కొన్ని రోజుల్లో మందుల వివరాలు తెలుసుకొని షాపులో నిలదొక్కుకుందామని మొదట అనుకున్నాను. కాని, ఆ యజమాని నన్ను చదువుకుంటున్న విద్యార్థిగా కాక ఒక ‘పనివానిలా’ చూశాడు. అక్కడా ఒక రోజుకంటే ఎక్కువ ఉండలేదు. హైదరాబాద్‌లో పనిచేసి చదువుకో వడం ఎంత కష్టమో అప్పుడు అర్థమైంది నాకు. 

కాని, మాధవాచారి అనే క్లాస్‌మేట్ సైన్‌బోర్డ్స్‌ను అందంగా తెలుగు, ఆంగ్లం అక్షరాలతో సిద్ధం చేసి వచ్చిన డబ్బుతో చదువుకునేవాడు. కొన్ని నెలలు ఆ మిత్రుని ఆశ్రయంలో ఉన్నాను కూడా. ఒకసారి రాజ్‌మొహల్లాకు పొద్దుటూరు నుంచి శతావధాని సుబ్బన్న వచ్చారు. వారిని కలిస్తే, “నాలాగా కవిత్వం ఆశువు చెప్ప”మని ఆశీర్వదించాడు. కాని, గుండేరావు హర్కారే, “ఆశువులో పడితే చదువులో వెనుకబడి పోతావు” అని చెప్పడంతో ఆశుకవిని కాలేకపోయాను.

చదువుతూ, చదువు చెబుతూ!

‘16 - 20 ఏండ్ల మధ్య ఉన్న నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏం ఉద్యోగం ఇస్తారు? అసలు నేను ఏం చేయగలను? ఇంతకూ, హైదరాబాద్‌కు చదువుకోవడానికి వచ్చానా; ఉద్యోగం చేయడానికా?’ ఈ ప్రశ్నలు నన్ను ఆలోచింపజేశాయి. అప్పట్నుంచీ చదువుపట్ల శ్రద్ధ పెరిగింది. ‘పిల్లలకు చదువు చెప్పి నేను చదువుకోవడమే ఉత్తమ’మని అనిపించింది.

అందుకే, జంటనగరాల్లో ఎక్కడున్నా మొదట ట్యూషన్ పిల్లల్ని వెతుక్కునే వాణ్ణి. అట్లా మకాం షాలిబండకు మార్చినప్పుడు అద్దె లేకుండా ఇల్లు దొరికింది. ఆ ఇంటి పిల్లలకూ చదువు చెప్పేవాణ్ణి. నెలకు వచ్చే డబ్బుతో సరుకులు కొనుక్కునేవాణ్ణి. అంతటితో వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడుండగానే చదువు పూర్తయి, ఉద్యోగమూ వచ్చింది.

ఈ పట్నంలో ఉన్న పదేళ్ల కాలంలో ముప్పయి ఇళ్లన్నా (అద్దె కోసం) మార్చి ఉంటాను. అటు చదువు  ఇటు ఉద్యోగం రెండూ ఎవరికైనా కష్టమే. కానీ, అలా కాలాన్ని వెళ్లదీసిన వాళ్లలో నేనొకణ్ణి.  ‘ధరిస్తే ధర్మం’ అంటారు పెద్దలు. విద్యార్జనను ఒక ధర్మంగా భావించడం వల్లే నేను పురోగమించగలిగాను.

ఎక్కడి ఊరు, ఎక్కడి పట్నం? ఎక్కడి వీధిబడి, ఎక్కడి విశ్వవిద్యాలయం? ఎందరు గురువులు, ఇంకెందరు స్నేహితులు? కాలచక్రం మనలను ఎంత ఇబ్బంది పెట్టినా మన లక్ష్యం చెదరకూడదు. ‘అభ్యాసేన సాధ్యతే విద్యా’ (కాళిదాసు: రఘవంశం), ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ (భగవద్గీత) వంటి మాటలే నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి.