సూర్యాపేట: విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై గత 50 ఏళ్లుగా నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేస్తున్న యూటిఎఫ్ (ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ఎల్లప్పుడు ముందంజలో నిలిచిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన 50 ఏళ్ళ ఉపాధ్యాయ ఉద్యమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1974 ఆగస్టు 10న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల సమస్యలపై ఏర్పాటు చేసిన ఈ సంఘం గడిచిన 50 ఏళ్లలో ఎన్నో సమస్యలపై ఉద్యమిస్తూనే ఉందన్నారు. రీ గ్రూపింగ్ స్కేల్స్ సాధన ,అప్రెంటిస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు సాధన, అప్రెంటిస్ రద్దు, టైం స్కేల్ అమలు లాంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ పెద్దన్న పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మధ్యాహ్న భోజన రేట్లను పెంచాలని, మోడల్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని, కేజీబీవీలోని ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే, కొత్త పిఆర్సి రిపోర్టును వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.