న్యూఢిల్లీ: టీ20 క్రికెట్ తన ఫేవరెట్ గేమ్ అని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ తన రక్తంలోనే ఉందని, టీ20లు తన శైలికి సరిగ్గా నప్పుతాయని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఈ జమైకా వీరుడు ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీ20 క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను క్రికెట్ ఫ్యామిలీలోనే పుట్టి పెరిగాను. మా నాన్న స్వతహాగా క్రికెట్ అభిమాని. అందుకే క్రికెట్ నా రక్తంలోనే ఉందని కచ్చితంగా చెప్పగలను. టీ20 ప్రపంచకప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం అద్భుతంగా అనిపిస్తోంది. ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ఊహించలేదు. కానీ క్రికెటర్ కాకపోయినా ఇవాల నా కల తీరింది. కానీ ఈసారి ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు చూడాలనకుంటున్నా. చిన్నప్పటి నుంచి పాకిస్థాన్ బౌలర్ వసీమ్ అక్రమ్‌ను బాగా ఇష్టపడేవాడిని. ఇక భారత్ నుంచి నా ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇక ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతడి ఆటకన్నా ఫిట్‌నెస్‌ను చూస్తేనే ముచ్చటేస్తోంది. క్రికెట్‌లో కాకుండా అథ్లెటిక్స్‌లో ఉండుంటే నన్ను దాటేవాడేమో. విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ నాకు మంచి స్నేహితుడు’ అని బోల్ట్ వెల్లడించాడు.