25-02-2025 02:35:44 AM
కొంతకాలంగా యూఎస్‌ఎయిడ్ కార్యకలాపాలపై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం 2వేల మంది ఉద్యోగు లపై వేటు వేసింది. మరికొంత మంది ఉద్యోగులను బలవంతంగా సెలవులపై పంపించింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఎయిడ్)లో పని చేస్తున్న 2వేల మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులకు సెలవులు మం జూరు చేసినట్టు ట్రంప్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
ప్రత్యేకంగా నియామకమైన వారితోపాటు ప్రధా న విధులు నిర్వర్తించే ఉద్యోగులను ఇందులో నుంచి మినహాయించినట్టు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఎలాన్ మస్క్ యూఎస్‌ఎయిడ్ కార్యకలాపాలపై గుర్రుగా ఉన్నారు. యూఎస్‌ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ గతంలో ఆరోపించారు.
ఈ క్రమంలోనే 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లడానికి వీలు లేకుండా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ఉద్యోగులు ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ప్రభుత్వ ఆదేశాలపై తాత్కాలికంగా స్టే ఇచ్చింది.
అయితే తాజాగా ఆ స్టేను దీర్ఘకాలం పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగులు వేసిన పిటిషన్‌ను యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోల్స్ తిరస్కరించారు. అంతేకాకుండా తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించింది.