calender_icon.png 29 March, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రరాజ్యం నుంచి మరో 295 మంది భారత్‌కు

22-03-2025 12:28:32 AM

వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ప్రభుత్వం

ఇప్పటికే మూడు విడతల్లో భారత్‌కు

న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న మరో 295 మందిని అమెరికా త్వరలోనే వెనక్కి పంపనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ(Ministry of External Affairs) వెల్లడించింది. అంతే కాకుండా డిపోర్టేషన్ సందర్భంగా అమెరికా అధికారులు భారతీయులతో వ్యవహరించిన తీరుపై కూడా తాము అమెరికాతో చర్చించనట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘మొదటి విడతలో పంపిన సైనిక విమానంలో ఉన్న వారి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయడాన్ని మేము తప్పుబట్టాం. తర్వాత ఫిబ్రవరి 15,16 తేదీల్లో అమెరికా పంపిన వలసదారులకు ఎటువంటి సంకెళ్లు వేయలేదు. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలు ఆ 295 మంది వివరాలు పరిశీలిస్తున్నాయి’ అని పేర్కొంది.

జనవరి నుంచి 388 మంది వెనక్కి

2025 జనవరి నుంచి అగ్రరాజ్యంలో ఉంటున్న 388 మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపారు. అందులో 333 మందిని అమెరికా నుంచి నేరుగా వెనక్కి పంపగా.. మరో 55 మందిని పనామా నుంచి వాణిజ్య విమానాల్లో వెనక్కి పంపారు. డీపోర్టేషన్ సందర్భంగా అమెరికా వ్యవహరించిన తీరుపై అనేక నిరసనలు చెలరేగాయి.