ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. దాదాపు తొమ్మిది నెలల పాటు ఉత్కంఠ రేకెత్తిస్తూనే వచ్చిన ఎన్నికలకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది మంగళవారం జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలాహారిస్ బరిలో ఉన్నారు. అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా వీరిద్దరి మధ్య నువ్యా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారో వారం వారం వెలువడే పోల్ సర్వేలు కూడా చెప్పలేక పోతున్నాయి.
ప్రతివారం అంచనాలు మారిపోతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రేసునుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తప్పుకొని కమలా హారిస్‌ను అభ్యర్థిగా నిర్ణయించినప్పటినుంచీ ఎన్నికల సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా బైడెన్‌పై స్పష్టమయిన ఆధిక్యలో ఉండిన ట్రంప్ పాపులారిటీ క్రమంగా తగ్గుతూ రాగా, కమల దూసుకు పోయారు. కానీ ఆ ఆధిక్యతను కమల నిలబెట్టుకోలేకపోయారని, ట్రంప్ సైతం బాగా పుంజుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య తేడా1 శాతం లోపే ఉన్నట్లు దాదాపు రెండు నెలలుగా అన్ని పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలో 50 రాష్ట్రాలున్నా అభ్యర్థుల తలరాతను మార్చేది మాత్రం ఏడు రాష్ట్రాలే. జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా సహా ఈ ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆధిక్యం పొందిన వారే అధ్యక్షుడవుతారని రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఈ ఏడు రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు ఉన్నాయి. తాజా అంచనా ప్రకారం కూడా ఈ రాష్ట్రాల్లో కూడా ఇద్దరికీ దాదాపు సమానంగా ప్రజలు మద్దతు పలికే అవకాశం ఉంది. ప్రతి ఓటూ కీలకంగా మారిన నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులూ ఈ స్వింగ్ రాష్ట్రాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. చివరి రోజు కూడా ఈ రాష్ట్రాల్లోనే ప్రచారం సాగించారు.
ఈ రాష్ట్రాల్లో ఎవరికి ఆధిక్యత లభించినా అది 23 శాతానికి మించి ఉండకపోవచ్చని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విచిత్రం ఏమిటంటే పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా ఏ అభ్యరీ ్థఅధ్యక్షుడు కాలేరు. ప్రజలు నేరుగా ఎన్నుకునే 538మంది ఎలక్టోరల్ కాలేజి సభ్యుల్లో 270 మంది మద్దతు ఎవరికి లభిస్తుందో వారే అధ్యక్షులవుతారు. ఇందుకు గతంలో ట్రంప్, హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన ఎన్నికే ఉదాహరణ. హిల్లరీ క్లింటన్‌కు మెజారిటీ పాపులర్ ఓట్లు లభించినా ట్రంప్ మెజారిటీ ఎలక్టోరల్ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిగా విజయం సాధించారు.
కాగా దాదాపు 27 కోట్లున్న అమెరికా ఓటర్లలో 7.5 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7గంటలనుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమయి సాయంత్రం 6 గంటలనుంచి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 గంటలనుంచి రాత్రి 9.30 గంటల మధ్య పోలింగ్ మొదలవుతుంది. తుది పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడుతాయి.
ట్రంప్, కమల మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడడానికి ఒకటి, రెండు రోజులు పడుతుంది. అయినప్పటికీ ఎలక్టోరల్ కాలేజి ఎన్నిక తతంగం పూర్తయి అధ్యక్ష ప్రమాణ స్వీకారం కోసం కొత్త ఏడాది జనవరి 20 వరకు ఆగాల్సిందే. ఇక పేరుకు అమెరికన్ ఓటర్లే ఓటు వేయనున్నప్పటికీ ఇతర దేశాలనుంచివచ్చి స్థిరపడిన ముఖ్యంగా ఆసియన్లు, ఆఫ్రికన్లు, అరబ్బులు, మెక్సికో తదితర ప్రాంతాలకు చెందిన స్పానిష్ మాట్లాడే వారు ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. స్వింగ్ స్టేట్‌లలో వీరి ప్రభావం ఎక్కువ. ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయుల ప్రభావం బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వారి ఓట్లూ కీలకం కానున్నాయని అంచనా.