18-04-2025 01:12:28 AM
‘రెడిట్’లో భారతీయ యువకుడి ఆవేదన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అమెరికా వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. అవకాశం ఉంటే అక్కడికి ఎగిరిపోవాలని చూస్తుంటారు యువత. చదువుల నిమిత్తం కొందరు, ఉద్యోగాల కోసం మరికొందరు అమెరికాకు వెళ్లాలని చూస్తారు. అయితే ఎవరు అమెరికా వెళ్లాలన్న వీసా ఇంటర్యూ తప్పనిసరి. వీసా ఇంటర్యూలో పాస్ అయితేనే అమెరికాకు వెళ్లే అవకాశముంటుంది. తాజాగా ఒక భారతీయ యువకుడు కూడా అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
వీసా ఇంటర్వ్యూ కోసం అమెరికా ఎంబసీ కార్యాలయానికి వెళ్లాడు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. అయితే సమాధానాలు ఇచ్చిన 40 సెకన్లలోనే అతడి వీసాను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. అంతే అమెరికాకు వెళ్లాలనుకున్న ఒక భారతీయుడి ఆశ క్షణాల్లోనే ఆవిరైంది. నిజాయితీగా సమాధానాలు చెప్పినందుకే తన వీసాను తిరస్కరించారని సామాజిక మాధ్యమం రెడిట్‌లో ‘nobody01810’ అనే ఐడీతో సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు.
‘బీ1/బీ2 వీసా ఇంటర్యూ కోసం ఇటీవల యూఎస్ ఎంబసీకి వెళ్లా. అక్కడ నన్ను మూడు ప్రశ్నలు అడిగారు. అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? భారత్ వెలుపల ఎప్పుడైనా పర్యటించారా? అమెరికాలో మీకు బంధువులు లేదా స్నేహితులు ఉన్నారా? అని అడిగారు. అన్నింటికి నిజాయితీగా సమాధానం చెప్పాను. ఫ్లోరిడాలో గర్ల్‌ఫ్రెండ్ ఉందన్న విషయం కూడా చెప్పా.
కానీ యూఎస్ ఎంబసీ అధికారికి నా సమాధానాలు నచ్చలేదేమో! ఈ వీసాకు నేను అర్హుడిని కాను అంటూ తిరస్కరణ స్లిప్‌ను నా చేతిలో పెట్టారు’ అని ఆ యూజర్ రాసుకొచ్చారు. అయితే యువకుడి పోస్టుపై అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.