- ఆయన మేనల్లుడు సాగర్‌కు కూడా జారీ
- 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
న్యూయార్క్, నవంబర్ 23: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతోపాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్( ఎస్‌ఈసీ) సమన్లు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందడానికి 265 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2,200 కోట్లు)ను లంచంగా ఇచ్చారన్న ఆరోపణలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది.
ఈ మేరకు ఈనెల 21వ తేదీన వారికి న్యూయార్క్ ఈస్ట్రన్ కోర్టు నుంచి సమన్లు పంపింది. తన వ్యాపార ప్రయోజనాల కోసం అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, సోలార్ కాంట్రాక్టులు పొందడానికి లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అదానీపై అక్కడి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులు పొందడానికి భారత్‌లోని అధికారులకు 250 మిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చినట్లు అదానీపై ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అదానీ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేసేలా అమెరికా ఇన్వెస్టర్లను గౌతమ్ అదానీ, సాగర్ ప్రేరేపించారని కమిషన్ ఆరోపించింది. భారత్‌లో గ్రీన్ ప్రాజెక్టు విజయంవంతం అవుతోందని, ఇందుకోసం అధికారులకు భారీగా లంచాలు ఇచ్చామని యూఎస్ ఇన్వెస్టర్లను నమ్మించారని, ఇది ఎస్‌ఈసీ నిబంధల ఉల్లంఘించడమేనని కమిషన్ పేర్కొన్నది.అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.