ఈ వారం ఇటు భారత్‌లోనూ, అటు యూఎస్‌లోనూ వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ ట్రెండ్‌కు కీలకమని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తెలిపారు. నవంబర్ నెలకు యూఎస్ వినిమయ ద్రవ్యోల్బణం గణాంకాలు డిసెంబర్ 11న వెల్లడికానుండగా, భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలు డిసెంబర్ 12న వెలువడతాయి.
డిసెంబర్ 17 తేదీల్లో జరిగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు నిర్ణయాలను అక్కడి ద్రవ్యోల్బణం డేటా ప్రభావితం చేస్తుందని, దేశీయంగా వెలువడే ఇన్‌ఫ్లేషన్ డేటా రానున్న రోజుల్లో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్ల బాటపై సంకేతాలు ఇస్తుందని గౌర్ వివరించారు.
ఐఐపీ, సీపీఐ ఇన్‌ఫ్లేషన్ తదితర స్థూల ఆర్థిక సూచికలవైపు మార్కెట్ దృష్టి మళ్లుతుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. వీటికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుపై మార్కెట్ ఫోకస్ ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా జపాన్, యూకేల జీడీపీ గణాంకాలు, చైనా వినియోగ ద్రవ్యోల్బణం డేటా ఈ వారమే వెలువడతాయని, ఇవి కూడా మార్కెట్ ప్రభావిత అంశాలేనని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు.