లంచాల ఆరోపణల ఎఫెక్ట్
వాషింగ్టన్: భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలతో భారతీయ దిగ్గజ సంస్థ అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ కేసు నమోదు చేసిన ప్రభావంఆ సంస్థకు రుణాలు అందించే సంస్థలను పునరాలోచించేలా చేస్తోంది.. శ్రీలంకలో అదానీ గ్రూపు మద్దతుతో చేపట్టనున్న రాజధాని కొలంబో పోర్టు అభివృద్ధి కోసం 550 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి గతంలో చేసుకున్న ఒప్పందంపై పునరాలోచన చేయనున్నట్లు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్సింగ్ సంస్థ (డీఎఫ్‌సీ) ప్రకటించింది.
అదానీ గ్రూపునకు భాగస్వామ్యం ఉన్న ఈ పోర్టు అభివృద్ధి కోసం 553 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సంస్థ గత నవంబర్‌లో ప్రకటించింది. అదానీకి సంబంధించిన ఆరోపణల గురించి డీఎఫ్‌సీకి తెలుసునని, అమెరికా న్యాయ శాఖ ఇటీవలి ప్రకటన నేపథ్యంలో దాని పరిణామాలను సమీక్షించుకుంటోందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, తమ ప్రాజెక్టులు, భాగస్వాములు అత్యున్నత ప్రమాణాలు, నిజాయి తీని పరిరక్షించడమే కాకుండా వాటిని పాటించేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కూడా తెలిపింది.
ఈ రుణ ఒప్పందం కింద ఇప్పటి వరకు ఎలాంటి నిధులను అందించలేదని డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఆదివారం డీఎఫ్‌సీకి సంబంధించినవార్తను తొలుత బైటపెట్టింది. అయితే దీనిపై అదానీ గ్రూపు ఇప్పటివరకు స్పందించలేదు.