19-04-2025 12:00:00 AM
ప్రత్యేక గీతాల స్పెషల్ బ్యూటీగా పేరున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. “ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ విశ్వవిద్యాల యంలోనూ నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు.
టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్, బాలకృష్ణలతో నటించా. అక్కడా నాకు ఎంతో మంది అభిమానులున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా నాకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా” అన్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఊర్వశీ రౌతేలా ఇప్పుడు పూర్తిగా భ్రమలో మునిగిపోయింది’ అంటూ కామెంట్స్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఊర్వశీ వ్యాఖ్యలను బద్రినాథ్ పరిసర ఆలయాల పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, ఆలయానికి నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం.. శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెప్తారు. అయితే, నటి ఊర్వశి అది తన పేరుతో ఉన్న ఆలయమని అందరినీ తప్పదోవ పట్టిస్తున్నారని స్థానిక అర్చకుడు భువన్‌చంద్ర ఉనియాల్ మండిపడ్డారు. ‘ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి ప్రకటనలు ఆమోద యోగ్యం కాదు. ఇది మత విశ్వాసాలను అగౌరవపర్చడమే. ఊర్వశి వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు.