calender_icon.png 27 December, 2024 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరికో రెవెన్యూ అధికారి

07-10-2024 02:20:27 AM

ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని నియమిస్తం 

దేశానికి రోల్ మోడల్‌గా కొత్త రెవెన్యూ చట్టం 

యాచారం, తిరుమలగిరి మండలాల్లో మొదట అమలు 

17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా 

దసరాలోగానే తహసీల్దార్ల బదిలీలు 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రాకముందే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రస్టు పట్టించి సామాన్యులకు రెవెన్యూ సేవలను అందకుండా చేసిందని ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ఉద్యోగులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా, రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఆదివారం ముఖాముఖి నిర్వహిం చారు.

ఈ సందర్భంగా పొంగులేటి మా ట్లాడుతూ పదేళ్ల నుంచి అమలవుతున్న ధరణి పోర్టల్, ఆర్‌వోఆర్ చట్టం  2020 ద్వారా ప్రజల ఇబ్బందులకు విముక్తి కల్పించేలా దేశానికే రోల్ మోడల్‌గా త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం 2024ను తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఈ చట్టాన్ని నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తున్నట్లు చెప్పా రు.

పైలట్ ప్రాజెక్ట్‌లో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకుని చట్టానికి తుదిరూపం ఇస్తామని వెల్లడించారు. తిరుమల గిరి మండలంలో శనివారం స్వయంగా పర్యటించగా.. 4,380 ఎకరాల్లో సర్వే చేస్తే అందులో 1,300 ఎకరాలు మోఖా మీద లేనివారికి పాసు బుక్కులు జారీ అయినట్టుగా వెలుగులోకి వచ్చిందని తెలిపారు. 

దసరాలోగా తహసీల్దార్ల బదిలీలు 

జిల్లాల్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను క్రియేట్ చేస్తామని మంత్రి ప్రకటించారు. 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు తిరిగి పంపేందుకు దసరా లోపే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఉద్యోగులు అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలనే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాహనాల అద్దెలను ఈ నెలాఖరుకు 50 శాతం చెల్లిస్తామని చెప్పారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెంచడం వల్ల దాదాపు 200 మండలాలకు సొంత కార్యాలయాలు లేవని, అప్పులు చేసి ఉన్న బిల్డింగ్‌ను కూలగొట్టి సెక్రటేరియట్ నిర్మించడం అవసరమా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు రాజీ పడొద్దని సూచించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ శాఖ మంత్రిగా ఎవరున్నా .. ప్రభుత్వ భూముల రికార్డులను టాంపరింగ్ చేయకుండా రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు.

రెవెన్యూ ఉద్యోగులకు జాబ్ చార్ట్ రూపకల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు కమిటీ వేయాల ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వానికి కళ్లు చెవులు రెవెన్యూ ఉద్యోగులేనని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరినా, సర్వీస్‌లో ఉన్నా ప్రతి ఒక్కరికీ శిక్షణ తప్పనిసరి ఇస్తామని చెప్పారు.

సమస్యలను చెప్పుకోవడానికి రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలతోపాటు పదోన్నతుల సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ తొమ్మిది నెలల్లో 3.50 లక్షల ధరణి దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు.

సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలె క్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి ఏ భాస్కర్‌రావు, ట్రెసా అధ్య క్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.