ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకోలు
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా భీంగల్ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరుగుతుండడంతో సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన అనుచరులతో కలిసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని స్వామి వారిని కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం పద్మ గంగ వీరయ్య చారిటబుల్ ట్రస్ట్ భీంగల్ శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పల్లికొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, పద్మ జగదీశ్వర్, కొప్పుల నరసయ్య, ప్రభాకర్, పవన్, కృష్ణ, రాఘవేంద్ర, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.