- స్థానిక సంస్థల గ్రాంట్లు, విపత్తు సహాయ నిధిపై సిఫారసులు తీసుకున్నాం
- రాజ్యాంగ సవరణతోనే సెస్, సర్‌చార్జ్‌ల సమస్యకు పరిష్కారం
- తుది నివేదికను తయారు చేసే ముందు సూచనలు పరిశీలిస్తాం
- 16వ ఆర్థిక సంఘం చైైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక, అర్బన్ డెవల్‌మెంట్‌పై ప్రభుత్వం చేసిన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ బాగున్నదని 16వ ఆర్థిక సంఘం చైైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అన్నారు. మంగళవారం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడుల విభజనపై సిఫారసులు చేసే ఉద్దేశంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించినట్టు చెప్పారు.
పంచాయతీలు, మునిసిపల్ సంస్థల కోసం విపత్తు సహాయ నిధులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల గ్రాంట్ల కోసం ఫైనాన్స్ కమిషన్ సూచిస్తుందని చెప్పారు. తెలంగాణ పర్యటనలో తమ కమిషన్ విస్తృతమైన చర్చలు జరిపిందని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ అభివృద్ధి విషయంలో రాష్ట్రం ముందుచూపుతో వ్యవహరిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తాము చూశామని, తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రశంసించారు. ఒక ఆర్థికవేత్తగా ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత సంతోషించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు.
అన్ని సూచనలు పరిశీలిస్తాం
జీడీపీ ఆధారంగా పన్నుల వాటా ఉండాలని, ట్యాక్స్‌ను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, సెస్‌లు, సర్‌చార్జీలను స్థూల పన్ను రాబడి పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం కోరిందని పణగరియా వివరించారు. వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందనిచెప్పారు. ముఖ్యంగా సెస్‌లు, సర్‌చార్జీల సమస్య పరిష్కారానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటివరకు తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను సందర్శించిందని వెల్లడించారు.
తుది ప్రణాళికను తయారు చేసే ముందు అన్ని సూచనలను పరిశీలిస్తామని స్పష్టంచేశారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు కేంద్రానికి సిఫారసు చేయాలని ప్రభుత్వం తమకు సూచనలు చేసిందని వివరించారు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విధానమని, తాము దీనిపై అధ్యయనం చేసి, తగిన సూచనలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అన్ని జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్ తదితరులు పాల్గొన్నారు.