మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి) : కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ నగరాల అభివృద్దికి ప్రత్యేక అర్బన్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ప్రభుత్వానికి సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన లక్ష్యం కాకుండా నగరాల అభివృద్దికి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలన్నారు. సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నగరీకరణ విధానాలు అనే అంశంపై శనివారం సెమినార్ జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రామికులు లేకుండా నగరాల అభివృద్ది జరగలేదని, పట్టణీకరణ అంటే కేవలం భూ వ్యాపార సంబంధాలు మాత్రమే కాకుండా, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే విధానాలు అవలంభించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఆదాయ పన్నులో నగరాల అభివృద్దికి 10 శాతం కేటాయించాలన్నారు. సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మెట్రో రైలు మాదిరిగానే ఎంఎంటీఎస్ రైళ్లపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. మురికివాడల్లో సదుపాయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.