వాళ్లందరికీ బాల్యం మళ్లీ మొదలైంది
అందరూ డ్బ్బు ఎనభై దాటిన పసిపిల్లలే
కొమ్మలపై ఇగురిస్తున్న కొత్త చిగురులే
సంసార సరిగమ పదనిసలు చవిచూసి
జీవితాలను వస్త్రగాలం పట్టిన పండుటాకులు
రెండు కాళ్లకు తోడుగా ఒక చేతి కర్ర
కొందరు చక్రాల కుర్చీల్లోనే చలనం
మరికొందరికి మంచమే మైదానం
అందరి కళ్ళలోనూ అనుభవాల జల
వృద్ధాప్యం అంటే ముసలితనమని కాదు
వృద్ధి చెందిన జ్ఞాన తరంగం
సంసారాల కోసం కరిగిపోయిన దేహాలు
సరాసరి అందరివీ సగౌరవ వ్యక్తిత్వాలే
పల్లె ప్రపంచంతో అనుసంధానమైన ఉద్యోగ బంధం
విరగాల్సిన వారసత్వ వృత్తులు రాలిపోయినవి
పక్షులన్నీ రెక్కలు వచ్చి ఎగిరి తీరం దాటినవి
చెట్లూ చెట్లు మాటలతో సేద తీరుతున్నాయి
జంటగానైనా ఒంటిగానైనా చేరిన అందరివీ
పొద్దు వంగుతున్న కొత్త కొత్త స్నేహాలు
నిరంతర వ్యాపకాల నుంచి నవ్వుల పువ్వులు
ఆధిపత్యపు పైత్యం దాటిపోయిన సమానత్వ ఛాయలు
అహంకారాలేమైనా ఉంటే కడుక్కోవడమే తరువాయి
ఇంటి ఒంటరి తనపు ఏకాంతం నుంచి
ఆశ్రమంలో పదుగురి మధ్య పద విరుపులు
పరిహాసాలు హాస్యాలు నవరసాల సంభాషణలు
ఒకే ఈడు వాళ్లంతా జ్ఞాపకాల కలబోతలు
భిన్న భిన్న నేపథ్యాలు వర్ణ వర్ణాల శిఖరాలు
రంగురంగుల మేలిమి కళల విలయాలు
ఒక్కొక్కరు ఒక్క దగ్గరే కుప్పబోస్తున్న స్మృతులు
ఆరు బయట నీరెండలో సాయంకాల నడకల్లో
ఏకాకితనం నుంచి సామూహికతకు చేరిన కాలం
చెట్లమీద కిచకిచల ఊరవిష్కలు వాలినయి.
(కొండపాకలో ఆనంద నిలయం వృద్ధాశ్రమం చూసి)
- అన్నవరం దేవేందర్