ఛత్తీస్‌గఢ్‌లో గుర్తించిన పరిశోధకులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఛత్తీస్‌గఢ్‌లోని ఆరు జిల్లాల్లో ప్రజలు నిత్యం తాగే నీటిలో ప్రమాదకరమైన యురేనియం ప్రమాదకర స్థాయిలో ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ఒక లీటర్ నీటిలో 15 మైక్రోగ్రాములకు మించకుండా యురేనియం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాముల వరకు ఉన్నా శుద్ధ జలంగానే పరిగణిస్తారు. కానీ గత జూన్‌లో నిర్వహించిన పరిశోధనలో లీటర్ నీటిలో ఏకంగా 100 నుంచి 130 మైక్రోగ్రాముల యురేనియం ఉన్నట్లు తేలింది. ఈ నీటిని తాగితే ప్రజలకు క్యాన్సర్‌తోపాటు చర్మ, కిడ్నీ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, కంకర్, బెమెతార, బలోద్, కవర్ధ జిల్లాల్లో ఈ కలుషిత నీటిని గుర్తించారు. ఈ నీటిలోని యురేనియం విద్యుత్తు ప్లాంట్లలో వాడే యురేనియం అంత శుద్ధంగా ఉన్నదని తెలిపారు.